ముష్కిన్ చెరువులో నిర్మాణాలు వద్దు : హైడ్రా

ఎఫ్టీఎల్ పరిధిని పరిరక్షించేందుకు చర్యలు

హైద‌రాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. బుధ‌వారం ముష్కిన్ చెరువు ఎఫ్ టీ ఎల్ (ఫుల్ ట్యాంక్) ను అధికారులు ప‌రిశీలించారు. తాత్కాలిక షెడ్డుల్లో ఉంటున్న వారికి వార్నింగ్ ఇచ్చారు. కొంద‌రు పావులుగా వాడుకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని, ఇక్క‌డి నుంచి ఖాళీ చేయాల‌ని, ఇందు కోసం 10 రోజుల గ‌డువు ఇస్తున్నామ‌ని హైడ్రా స్ప‌ష్టం చేసింది. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న భూములను కొట్టేయాలని కబ్జాదారులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. నిర్మాణ వ్యర్థాలు, మట్టి పోసి.. చెరువు స్వరూపాన్ని మార్చేసి బడా నిర్మాణాలు చేపట్టాలని చూస్తున్నారని మండిప‌డింది. ఇంటింటికీ వెళ్లి సేకరించిన చెత్తను తెచ్చి చెరువు పరిధిలో వేస్తున్నారని తెలిపింది. ఇక్కడే చెత్తను వేరు చేసి వ్యర్థాలను చెరువులోకి వదిలేస్తున్నార‌ని మండిప‌డింది.

దీంతో చెరువు కలుషితం అవుతోంది. ఇక్కడ ఉన్న తాత్కాలిక షెడ్డులు (నివాసాలు), దుకాణాలను పెట్టించి.. వారి ఆక్రమణలను తొలగించకుండా అడ్డుగా మిమ్ములను ముందుంచుతున్నారని పేర్కొంది. చెరువు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, మీరంతా ఖాళీ చేస్తే. చెరువును అభివృద్ధి చేయాలని చూస్తున్నాం అని వార్నింగ్ ఇచ్చింది. ఇక్కడ చెరువు అభివృద్ధి పనులు చేసేవారికి ఆటంకాలు కల్పించవద్దు అని అక్కడ తాత్కాలిక షెడ్డుల్లో ఉన్న వారికి హైడ్రా అధికారులు చెప్పారు. ప్రత్యామ్నాయం చూసుకుని చెరువు ఎఫ్టీఎల్ పరిధిని ఖాళీ చేయాలని సూచించారు. హైడ్రా అడిషనల్ డైరెక్టర్ శ్రీ వర్ల పాపయ్య, హైడ్రా ఏసీపీ శ్రీ తిరుమల్, ఇరిగేషన్ శాఖ డీఈ రమాదేవి తో పాటు.. పలువురు హైడ్రా అధికారులు, రెవెన్యూ, ఇరిగేషన్ అదికారులు అక్కడ తాత్కాలిక షెడ్డులు వేసుకుని నివాసముంటున్న వారితో మాట్లాడారు.

Leave A Reply

Your Email Id will not be published!