అమరావతి : ప్రభుత్వ శాఖలు అందిస్తున్న అన్ని సేవలు ఈ ఏడాది డిసెంబర్ నాటికల్లా ఆన్లైన్లో అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వాట్సప్ గవర్నెన్స్ మన మిత్ర పరిధిలోకి అన్ని సేవలు తీసుకు వస్తే ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని ఉండదని చెప్పారు. ఆర్టీజీఎస్పై వివిధ శాఖల ఉన్నతాధికారులతో క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. మనమిత్ర వాట్సప్ గవర్నెన్సు ద్వారా ప్రస్తుతం 1,035 సేవలు అందిస్తున్నామని తెలిపారు. వాట్సప్ గవర్నెన్సు సేవలు ప్రారంభించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో 54 లక్షల మంది 1.78 కోట్ల సేవలు పొందారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. వాట్సప్ గవర్నెన్స్ సేవల వినియోగం పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని సీఎం కు తెలిపారు.
ఇప్పటి వరకూ 24 లక్షల మందికి పైగా వాట్సప్ గవర్నెన్సు సేవలు ఎలా పొందాలో అవగాహన కల్పించామని చెప్పారు. కర్నూలు జిల్లాలో ఏర్నాటు చేస్తున్న డ్రోన్ సిటీ ఫేజ్ 1 అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని, ఇప్పటికే ప్లాంట్లు నెలకొల్పేందుకు ముందుకొచ్చిన 8 కంపెనీలకు భూముల కేటాయింపు పూర్తయ్యిందని, మే నెల రెండో వారంలో ఇవన్నీ గ్రౌండ్ అవుతాయని ముఖ్యమంత్రికి వివరించారు. డ్రోన్ సిటీ మాస్టర్ ప్లాన్ ఖరారయ్యిందని అధికారులు ఇచ్చిన వివరణ పై స్పందించిన సీఎం… ఈ ఏడాది జూలై నాటికి మొదటి దశ పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
