ముంబై : బీసీసీఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అత్యంత జనాదరణ పొందిన ఐపీఎల్ మెగా టోర్నమెంట్ 19వ సీజన్ రోజు రోజుకు రసవత్తరంగా మారుతోంది. ఏ జట్లు ప్లే ఆఫ్స్ కు చేరుకుంటాయనే దానిపై టెన్షన్ నెలకొంది ఫ్యాన్స్ లో. ప్రస్తుతం ప్లే ఆఫ్స్ రేసులోకి రెండు టీంలు వెళ్లాయి. వాటిలో పాట్ కమిన్స్ సారథ్యంలోని సన్ రైజర్స్ హైదరాబాద్ కాగా మరో జట్టు రజిత్ పాటిదార్ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉన్నాయి. మరో వైపు ఇంకా రెండు జట్లు ఖరారు కావాల్సి ఉంది. ఇందు కోసం పంజాబ్ కింగ్స్ ఎలెవన్, చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ పోటీ పడుతున్నాయి. ఈ తరుణంలో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఎక్కడ నిర్వహిస్తారనే దానిపై గత కొంత కాలంగా సస్పెన్స్ కొనసాగిస్తూ వచ్చింది బీసీసీఐ.
ఎట్టకేలకు ఇప్పటికే ఐపీఎల్ టోర్నీ కి సంబంధించి చాలా మ్యాచ్ లు పూర్తయ్యే దశలో ఉన్నాయి. ఇంకా ఒక్కో జట్టు నాలుగు లేదా మూడు మ్యాచ్ లు మాత్రమే ఆడాల్సి ఉంది. ఇవాళ బీసీసీఐ కీలక ప్రకటన చేసింది ఫైనల్ మ్యాచ్ కోసం. గత సీజన్ లాగానే ఈసారి కూడా అహ్మదాబాద్ లోనే ఫైనల్ మ్యాచ్ నిర్వహంచాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియానికి ఫైనల్ ఆతిథ్య హక్కులు దక్కుతాయని ఆశించినా బోర్డు నిర్దేశించిన నిబంధనల పరిమితికి లోబడి స్థానిక అసోసియేషన్‌లో పరిస్థితులు లేకపోవడంతో వేదికను మార్చినట్టు బీసీసీఐ స్పష్టం చేసింది.
ఇందుకు సంబంధించి షెడ్యూల్ ను ఖరారు చేసింది. క్వాలిఫయర్ -1 ధర్మశాలలో , ముల్లాన్ పూర్ లో ఎలిమినేటర్ , క్వాలిఫయర్ -2 కు ముల్లాన్ పూర్ ఆతిథ్యం ఇవ్వనుందని వెల్లడించింది. ఈనెల 24 వరకు లీగ్ మ్యాచ్ లు కొనసాగుతాయి. 26 నుంచి ప్లే ఆఫ్స్ మొదలు కానున్నాయి. 26న క్వాలిఫయర్ -1, 27న ఎలిమినేటర్ , 29న క్వాలిఫయర్ -2 మ్యాచ్ లు జరుగుతాయి. 31న ఫైనల్ మ్యాచ్ జరుగుతుందని స్పష్టం చేసింది.
