రైతులకు సమృద్ధిగా విత్తనాలు, ఎరువులు, సాగునీరు

వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు

అమరావతి : రాష్ట్రంలో ఖరీఫ్–2026 సీజన్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు వ్యవసాయశాఖ సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతోందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, సాగునీరు సమయానికి అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందన్నారు. 2026-27 సంవత్సరానికి రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా రూ.294 కోట్ల బడ్జెట్‌తో 7.46 లక్షల క్వింటాళ్ల విత్తనాలను రైతులకు రాయితీపై సరఫరా చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించడం ద్వారా అధిక దిగుబడులు సాధించేలా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

ఖరీఫ్–2026 సీజన్‌కు అవసరమైన 93 వేల క్వింటాళ్ల పచ్చిరొట్ట ఎరువు విత్తనాలను గత సంవత్సరాల మాదిరిగానే 50 శాతం రాయితీపై సరఫరా చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే 30 వేల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలను సేకరించి రైతు సేవా కేంద్రాల ద్వారా పంపిణీకి సిద్ధం చేసినట్లు చెప్పారు. మిగిలిన అవసరాల కోసం టీజీఎస్ డీసీ, హెచ్ఐఎల్, ఎన్ఎస్ సీ, ఆంగ్రూ సంస్థల ద్వారా అదనపు విత్తనాల సేకరణ చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ ఏడాది 2.20 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను 40 శాతం రాయితీపై పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. వేరుశనగ విత్తనాల సేకరణకు సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తయిందని, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మే 20 నుంచి రైతు సేవా కేంద్రాల ద్వారా పంపిణీ ప్రారంభమవుతుందని చెప్పారు.

అలాగే 1.62 లక్షల క్వింటాళ్ల వరి విత్తనాలను మే 15 నుంచి రాయితీపై రైతులకు అందజేయనున్నట్లు వెల్లడించారు. చిరుధాన్యాలు, అపరాలు తదితర ఇతర విత్తనాలను జూన్ 15 నుంచి రైతు సేవా కేంద్రాల ద్వారా పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!