నల్లగొండ జిల్లా : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలంతా హైడ్రాను కోరుకుంటున్నారని తెలిపారు. నగర ప్రజలే కాదు ఇతర పట్టణాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కూడా హైడ్రా లాంటి వ్యవస్థ ప్రతి రాష్ట్రంలో ఉండాలని కోరుకుంటున్నారన్నారు. నల్గొండలో ఓ ప్రైవేటు కార్యక్రమనికి హాజరయిన సందర్భంగా అక్కడ విలేకరులు కమిషనర్ ను కలసి హైడ్రా కార్యక్రమాలపై ఆరా తీశారు. చాలా మంది హైడ్రాను విస్తరించాలని కోరుతున్నారని కమిషనర్ పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం మా పరిధి ఓఆర్ఆర్ వరకే ఉంటుందన్నారు. ప్రజల నుంచి హైడ్రాకు మంచి స్పందన, పాజిటివిటీ వస్తోందని చెప్పారు ఏవీ రంగనాథ్. ఇతర జిల్లాల ప్రజలు కూడా తమకు కూడా హైడ్రా కావాలని కోరడం తనను విస్తు పోయేలా చేసిందన్నారు.
బీజేపీ మాజీ వైస్ ప్రెసిడెంట్ హైడ్రా లాంటి వ్యవస్త , సంస్థ ముంబైలో కూడా అవసరమని ఒక ఆర్టికల్ రాశారు అని చెప్పారు. ముందుగా నిర్మాణాత్మక అభివృద్ధి వైపు వెళ్తాం అన్నారు ఏవీ రంగనాథ్. దాదాపు 25 చెరువులను అభివృద్ధి చేస్తాం అని తెలిపారు. అలాగే 5 ఎకరాలు, 10 ఎకరాల చిన్న చెరువులను CSR ద్వారా అభివృద్ధి చేస్తాం అని చెప్పారు. చెరువుల పునరుద్ధరణ ఒక ఎత్తయితే వాటి ఆక్రమణలను తొలగించడం పెద్ద టాస్కు అని పేర్కొన్నారు. ఏడాదిన్నరలో 2100 ఎకరాల భూమిని కాపాడడం సాధారణ విషయం కాదని కర్ణాటక బృందం చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. చెరువుల పునరుద్ధరణ ఎలా చేపడుతున్నారు తెలుసుకోవడానికి తాము బెంగళూరు వెళ్తే.. ఆక్రమణలు తొలగించి చెరువులను అభివృద్ధి చేయడం ఎలానో ఇక్కడకు వచ్చి కర్ణాటక మున్సిపల్ బృందాలు తెలుసుకునే పనిలో పడ్డాయని చెప్పారు. ఇటీవల చెన్నై నుంచి కూడా అధికారుల బృందం నగరానికి వచ్చి చెరువుల అభివృద్ధిని, వర్షాకాలం వరదలు ముంచెత్తకుండా హైడ్రా తీసుకున్న చర్యలను అధ్యయనం చేసిందన్నారు. చెరువుల పునరుజ్జీవన కార్యక్రమాల్లో ఇళ్లు కోల్పోయిన పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయాన్ని గుర్తు చేశారు.