అమరావతి : ఖరీఫ్–2026 సీజన్‌కు రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి సరఫరాపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులకు సమయానికి సాగునీరు అందించేందుకు నీటిపారుదల శాఖతో సమన్వయం చేస్తూ సమగ్ర ప్రణాళిక అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రధాన, మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో నీటి లభ్యత, జలాశయాల్లో నిల్వలు, కాలువల మరమ్మతులు, ఖరీఫ్ అవసరాలను సమీక్షించిన అనంతరం మే 15 నుంచి దశలవారీగా సాగునీటి విడుదలకు ప్రభుత్వం సిద్ధమైందని మంత్రి వెల్లడించారు. ఖరీఫ్ పంటల సాగు సాధారణంగా జూన్ నుంచి ప్రారంభమై అక్టోబర్ వరకు కొనసాగుతుందని, వరి, మొక్కజొన్న, జొన్న, సజ్జ తదితర పంటలకు సమృద్ధిగా వర్షపాతం, సాగునీరు అవసరమవుతాయని తెలిపారు. ప్రతి జిల్లాలో నీటి లభ్యత ఆధారంగా ఇరిగేషన్ బోర్డు సమావేశాల్లో నీటి విడుదల తేదీలను ఖరారు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
గోదావరి డెల్టా వ్యవస్థ (GDS) పరిధిలో ప్రస్తుతం 51.67 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని మంత్రి తెలిపారు. జూన్ 30 వరకు ఖరీఫ్ అవసరాలకు 38.52 టీఎంసీలు అవసరమవుతాయని, మిగిలిన 13.15 టీఎంసీలతో జూలై 14 వరకు సాగునీటి అవసరాలు తీర్చగలమని చెప్పారు. కాలువల మరమ్మతులు, సిల్టు తొలగింపు, కలుపు నివారణ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయని తెలిపారు. కాలువల అభివృద్ధి పనులు చేపట్టినందున మే చివరి వరకు పనులు పూర్తి చేసి జూన్ 1 నుంచి నీటి విడుదల ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కృష్ణా డెల్టా వ్యవస్థలో పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుతం 24.43 టీఎంసీల ప్రత్యక్ష నిల్వ ఉందని తెలిపారు. జూన్ నెల ప్రారంభ ఖరీఫ్ అవసరాలకు 18.22 టీఎంసీలు అవసరమవుతాయని చెప్పారు. తాగునీటి అవసరాలకు 4 టీఎంసీలు కేటాయించిన తర్వాత 2.21 టీఎంసీలు మిగులుతున్నాయని పేర్కొన్నారు.
