జూన్ 1 నుంచి డెల్టా ప్రాంతాల‌కు సాగు నీరు

విడుద‌ల చేస్తామ‌న్న ఏపీ కూట‌మి స‌ర్కార్

అమ‌రావ‌తి : శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి ప్రస్తుతం అదనపు నీటి లభ్యత లేదని చెప్పారు మంత్రి అచ్చెన్నాయుడు. కాలువల నిర్వహణ పనులు మే 2 నుంచి ప్రారంభమయ్యాయని, జూన్ 1 నుంచి కృష్ణా తూర్పు డెల్టా, జూలై 1 నుంచి కృష్ణా పశ్చిమ డెల్టాకు నీటి విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల పరిధిలో ప్రస్తుతం 9.22 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని మంత్రి తెలిపారు. సాగు పనులు జూన్ రెండో వారంలో ప్రారంభమవుతాయని, వరి నాట్లు జూలై రెండో వారంలో ప్రారంభమయ్యే అవకాశముందని పేర్కొన్నారు. ప్రస్తుతం కాలువల నిర్వహణ పనులు వేగంగా జరుగుతున్నాయని వెల్లడించారు. కడప జిల్లాలోని ఐదు మధ్య తరహా ప్రాజెక్టుల్లో ప్రస్తుతం 3.905 టీఎంసీల నిల్వ ఉందని తెలిపారు.

కాలువల వ్యవస్థ సక్రమంగా సిద్ధంగా ఉండడంతో మే 15 నుంచే నీటి విడుదలకు అవకాశం ఉందన్నారు. అనంతపురం జిల్లాలో గత పదేళ్లలో జూలైలోనే నీటి విడుదల ప్రారంభమైన దృష్ట్యా ఈ ఏడాది కూడా జూలై 17 ప్రాంతంలో నీటి విడుదల జరిగే అవకాశముందని తెలిపారు. తుంగభద్ర హై లెవల్ కాలువ (TBPHLC) పరిధిలో కూడా ప్రస్తుతం నీటి నిల్వలు పరిమితంగా ఉన్నాయని, గత అనుభవాల ప్రకారం జూలైలోనే నీటి విడుదల ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. నాగార్జునసాగర్ జలాశయంలో ప్రస్తుతం మొత్తం 27.07 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని, అందులో ఆంధ్రప్రదేశ్ వాటా 17.866 టీఎంసీలుగా ఉందని మంత్రి తెలిపారు. తాగునీరు, ప్రారంభ సాగు అవసరాల కోసం మే 15 నుంచి జూన్ 15 వరకు రోజుకు 7,000 క్యూసెక్కుల చొప్పున విడుదల చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!