భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ అభివృద్ది
కీలక వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని కోర్ అర్బన్ రీజియన్ మొత్తంగా ఎదురవుతున్న సమస్యలను పరిష్కరిస్తూ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ నగరాన్ని ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఆధునీకరణ, నగరీకరణతో సమీప భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లు, వాటిని అధిగమించడానికి ప్రజా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ప్రస్తావించారు. పెరుగుతున్న నగరీకరణ వల్ల సమీప భవిష్యత్తులో మరిన్ని కొత్త సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు.అందుకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.
హైదరాబాద్ నగరాన్ని ట్రాఫిక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం అన్నారు సీఎం. కీలకమైన ప్రాంతాల్లో అండర్‌పాస్‌లు, ఉపరితల రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్ల వంటి మూడు విధానాల్లో ట్రాఫిక్‌కు సులభతరమైన రవాణా మార్గాలను కల్పించే విధానాన్ని ఎంచుకున్నాం అని తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం కేవలం రోడ్ల విస్తరణ మాత్రమే చేపడితే సరిపోదన్నారు. బహుళ విధానాల్లో రవాణా సౌకర్యాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు సీఎం. పార్కింగ్ ఇబ్బందులను అధిగమించేందుకు నగరంలో మల్టీ లెవెల్ పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నాం అని వివరించారు.
రాష్ట్రాన్ని CURE, PURE, RARE విభాగాలుగా అభివృద్ది చేయడానికి ప్రణాళికలు రూపొందించాం అని చెప్పారు. ప్రధానంగా ఔటర్ రింగ్ రోడ్డు లోపలి ప్రాంతాన్ని సర్వీస్ సెక్టార్‌గా గుర్తించాం అన్నారు. ఓఆర్ఆర్ బయట నుంచి రీజనల్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ప్రాంతం పెరి అర్బన్ రీజియన్ ఎకానమి ప్రాంతంగా ప్రధానంగా మాన్యూఫ్యాక్చర్ సెక్టార్‌గా గుర్తించినట్లు తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్డు బయట ఉన్న రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ గా వ్యవసాయం, దాని అనుబంధ రంగాలను అభివృద్ధి చేయాలని ప్రణాళికలను సిద్ధం చేశాం అని చెప్పారు.