చెన్నై : తమిళనాడులో గత కొన్ని రోజులుగా చోటు చేసుకున్న రాజకీయ ఉత్కంఠకు తెర పడింది. ఆదివారం చెన్నై వేదికగా భారీ అభిమాన జన సందోహం మధ్య టీవీకే పార్టీ చీఫ్ జోసెఫ్ విజయ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇంఛార్జ్ గవర్నర్ ఆయన చేత ప్రమాణం చేయించారు. జోసెఫ్ విజయ్ తో పాటు కేబినెట్ లో తొమ్మిది మంది మంత్రులుగా కొలువు తీరారు. తమిళగ వెట్రి కజగం (TVK) అధ్యక్షుడు చంద్రశేఖర్ జోసెఫ్ విజయ్ తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం తో రాష్ట్ర రాజకీయ చరిత్రలో కొత్త చరిత్రకు నాంది పలికారు.
ఇదిలా ఉండగా తమిళనాడు అసెంబ్లీలో 118 స్థానాల ‘మ్యాజిక్ మెజారిటీ’ మార్కును చేరుకోవడానికి విజయ్‌కు ఐదు రోజుల సమయం ఇచ్చారు ఇంఛార్జ్ గవర్నర్. గవర్నర్‌తో నాలుగు సమావేశాలు , సంభావ్య మిత్రపక్షాలతో అంతులేని చర్చలు అవసరమయ్యాయి. గత నెలలో జరిగిన ఎన్నికల్లో తన టీవీకే పార్టీ 234 స్థానాలకు గాను 108 స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే. 51 ఏళ్ల ఈ నటుడు-రాజకీయ నాయకుడు, శనివారం గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కలిసి, తమకు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు, విదుతలై చిరుతైగల్ కచ్చి కి చెందిన ఇద్దరు శాసనసభ్యుల మద్దతు ఉన్నట్లు తెలిపారు. అంతేకాకుండా భారత కమ్యూనిస్టు పార్టీ , భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) , మరియు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నుండి చెరో ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు కూడా తమకు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.
