ఇకపై రక్షణ సీమగా మారనున్న రాయలసీమ
రూ.15,803 వేల కోట్లతో ADA ప్రాజెక్టుకు పుట్టపర్తిలో శంకుస్థాపన
అమరావతి : రాయల సీమ రతనాల సీమ… ఇది చరిత్ర. ఉద్యాన సీమ… ఇది వర్తమానం. రక్షణ సీమ… ఇది భవిష్యత్. ఇరిగేషన్, హర్టీకల్చర్, స్పేస్, డ్రోన్, సోలార్, విండ్ ఎనర్టీ వంటి రంగాల్లో దూసుకెళ్తున్న రాయలసీమ డెవలప్మెంట్ జర్నీలో మరో కీలక రంగం జత కానుంది. ఇకపై రాయలసీమ దేశ రక్షణ రంగంలోనూ తన ముద్రను వేయబోతోంది. ప్రత్యేకతను చాటుకోనుంది. శుక్రవారం శ్రీ సత్యసాయి జిల్లాలో దేశం గర్వించే అత్యంత ప్రతిష్టాత్మకమైన అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) డిఫెన్స్ ప్రాజెక్టును ఏరో నాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ-డీఆర్డీఏ సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేయనున్నాయి. పుట్టపర్తిలో జరగనున్న ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు.
ADA ప్రాజెక్టు సుమారు రూ.15,803 కోట్ల భారీ వ్యయంతో, 650 ఎకరాల్లో ఈ రూపు దిద్దుకోనుంది. ఇది భారతదేశపు మొట్ట మొదటి 5th Generation స్టెల్త్ మల్టీ-రోల్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రాజెక్ట్. ఇందులో స్టెల్త్ టెక్నాలజీ, ట్విన్ ఇంజిన్ సూపర్ క్రూయిజ్ సామర్థ్యం, అత్యాధునిక ఏవియానిక్స్ వంటి హంగులతో యుద్ద విమానాలను అభివృద్ధి చేయనున్నారు. యుద్ద విమానాలను పుట్టపర్తిలోనే అభివృద్ధి చేయడంతోపాటు… టెస్టింగ్ కూడా చేపట్టేలా ప్రాజెక్టును రూపొందించనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 7,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంచనా. అలాగే, ఈ ప్రధాన ప్రాజెక్టుకు అనుబంధంగా వచ్చే ఇతర యూనిట్ల ద్వారా మరో రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. దీని కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా 400 ఎకరాలు కేటాయించింది. వీటితో పాటు కర్నూలు జిల్లాలో నిర్మిస్తున్న ‘డ్రోన్ సిటీ’ ద్వారా భారతదేశంలోనే అత్యుత్తమ డ్రోన్ ఎకోసిస్టమ్‌ను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది.
ఆ మేరకు పెట్టుబడులు భారీ ఎత్తున రానున్నాయి. మొత్తంగా రాయలసీమ, ప్రకాశం జిల్లాల పరిధిలో డిఫెన్స్, డ్రోన్ రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుడులు వచ్చేందుకు ప్రభుత్వం గ్రౌండ్ ప్రిపేర్ చేస్తోంది. దీంట్లో భాగంగా డ్రోన్ ప్రాజెక్టుల ఏర్పాటుకు రంగం సిద్దమవుతోంది. ADA ప్రాజెక్టుతో పాటే డిఫెన్స్ రంగానికి చెందిన 4 ప్రాజెక్టులు, 8 డ్రోన్ ప్రాజెక్టులకు శంకుస్థాపన జరగనుంది. ఈ 12 ప్రాజెక్టుల ద్వారా రూ. 4145 కోట్ల పెట్టుబడులు, 6071 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. వీటిల్లో మడకశిరలో రెండు ప్రాజెక్టులు, దొనకొండ, నెల్లూరుల్లో ఒక్కో ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. మిగిలిన 8 డ్రోన్ ప్రాజెక్టులు కర్నూలు జిల్లా డ్రోన్ సిటీలో నిర్మాణాలు చేపట్టనున్నాయి.
