గడువు లోగానే పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తాం
సంచలన ప్రకటన చేసిన సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. నిర్దేశించిన గడువు లోగానే పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామన్నారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో పోలవరం నిర్వాసితులతో ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు. పోలవరం నిర్వాసితులకు రూ. 306.61 కోట్ల పరిహారం, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని అందించారు. పలువురు లబ్దిదారులకు ఆర్ అండ్ ఆర్ కాలనీలకు సంబంధించి ఇళ్ల తాళాలను ఇచ్చారు. ఇళ్ల పట్టాల నిమిత్తం 62.05 ఎకరాలు, ల్యాండ్ టూ ల్యాండ్ కింద 520.02 ఎకరాలను గుర్తించినట్టు అధికారుల వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాలుగోసారి పరిహారాన్ని ఇచ్చారు. గత ఏడాది 2025 సంక్రాంతి, దీపావళి సందర్భంగా రెండుసార్లు, ఈ ఏడాది ఉగాది సందర్భంగా మూడోసారి, ఇవాళ కాటన్ జయంతి సందర్భంగా నాలుగోసారి పోలవరం నిర్వాసితులకు పరిహారం ఇవ్వడం విశేషం.
కూటమి ప్రభుత్వం వచ్చాక 29,936 మంది నిర్వాసితులకు సుమారు రూ.2,250 కోట్ల పరిహారం చెల్లించామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. పోలవరం నిర్వాసితులతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మీద… తమకు అందే పరిహరం మీద నమ్మకం కలిగిందన్నారు నిర్వాసితులు. నిర్వాసితులకు డబ్బులివ్వలేనని… తాను ఏం చేయలేనని నాటి సీఎం జగన్ చెప్పడంతో తాము ఆందోళన చెందామన్నారు. కానీ చంద్రబాబు వచ్చాక నమ్మకం కలిగిందన్నారు.
ఆర్ అండ్ ఆర్ కాలనీలకు గత ప్రభుత్వం రోడ్లు కూడా వేయలేదని వాపోయారు పలువురు ముంపు గ్రామాల ప్రజలు. వరదల సమయంలో సర్వం కొల్పోయిన తమకు కనీసం బియ్యం పంపిణీ కూడా చేపట్టలేదని సీఎంకు వివరించారు.
