ఏపీ రాష్ట్రాన్ని జంగిల్ రాజ్ గా మార్చేసిన చంద్రబాబు
సంచలన ఆరోపణలు చేసిన మాజీ సీఎం జగన్ రెడ్డి
అమరావతి : ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలు తమ బతుకు బండిని నడపడానికే తీవ్ర కష్టాలు పడుతున్నారని ఆవేదన చెందారు. ఇచ్చిన హామీలకు వెన్నుపోటు పొడిచి, దారుణమైన అవినీతిని, దోపిడీని కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నించే గొంతుకలను అణిచివేస్తూ, రాష్ట్రాన్ని జంగిల్ రాజ్‌గా రాష్ట్రాన్ని మార్చారంటూ మండిపడ్డారు. ఈ రెండేళ్లలో ప్రజలకు పలానా మంచి చేశానని చెప్పుకునే పరిస్థితి చంద్రబాబుకు ఏ కోశానా లేదన్నారు. రెండేళ్ల ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తే అత్యంత ఘోరం అన్నారు. బాబు ష్యూరిటీ- మోసం గ్యారంటీ, అన్నదాన్ని ప్రతిరోజూ రుజువు చేస్తూనే ఉన్నాడంటూ ఎద్దేవా చేశారు జగన్ రెడ్డి. ప్రజలను డైవర్ట్ చేయడానికి, తన ఎల్లో గ్యాంగ్‌తో కలిసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఒక భూతంలా చూపే ప్రయత్నం చేస్తున్నాడని ధ్వజమెత్తారు. ఈ మధ్యకాలంలో చంద్రబాబు BPకి కారణం, మావిగన్ అంటూ సెటైర్ వేశారు.
.మావిగన్ అంటేనే చంద్రబాబుకు గుండె ఆగినంత పనవుతోందని అన్నారు మాజీ సీఎం. ఇప్పటికే దాదాపు రూ.1,200 కోట్లతో నిర్మించిన అసెంబ్లీని, సెక్రటేరియట్‌ని, హైకోర్టుని పక్కనపెట్టడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. మళ్లీ వాటిపేరుతో కొత్తగా బిల్డింగులు కడుతున్నాడని, ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్మినెంట్ సెక్రటేరియట్ పేరిట నిర్మిస్తున్న 5 బిల్డింగుల్లో చంద్రబాబు చేస్తున్న దోపిడీని చూసి రాష్ట్ర ప్రజలంతా నివ్వెరపోతున్నారని అన్నారు. 2018లో ఇదే 52,20,496 SFT బిల్డప్ ఏరియాతో ఇవే 5 బిల్డింగులు కట్టడానికి, ఆరోజు రూ.2,271 కోట్లకు చంద్రబాబు టెండర్ ఖరారు చేసి పనులు అప్పగించాడని చెప్పారు జగన్ రెడ్డి. ఈ లెక్కన ఒక్కో SFTకి సుమారుగా రూ.4,350లు పడుతుంది. 2018 రేట్లకు, అప్పటికి, అది ఎక్కువ. 2019కు ముందు చంద్రబాబు ఏ కంపెనీలకు ఏ పనులైతే ఇచ్చాడో, 2024లో టెండర్లు రద్దుచేసి పిలిచిన తర్వాత మళ్లీ అవే కంపెనీలకు అవే పనులు ఇచ్చారని సంచలన ఆరోపణలు చేశారు.