అనకాపల్లి జిల్లా : ఈ సమాజంలో కుల, మతాలకు అతీతంగా మనిషికి గుర్తింపు వచ్చేది కేవలం విద్యతోనే సాధ్యం అవుతుందన్నారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత. చదువు ఒక్కటే మనిషికి విలువను పెంచేలా చేస్తుందన్నారు. అందుకే ప్రతి ఒక్కరు చదువు కోవడంపై దృష్టి సారించాలన్నారు. సక్సెస్ ను పొందాలంటే కష్టపడాలని అన్నారు. ఇందుకు దగ్గరి దారులంటూ ఏవీ లేవన్నారు. తాను కూడా ఇవాళ ఈ స్తాయిలో ఉన్నానంటే దానికి ప్రధాన కారణం చదువు కోవడమేనని అన్నారు. ఎన్నో కష్టాలు పడి చదువు కున్నానని తెలిపారు. తాను పంతులమ్మగా పాఠాలు చెప్పానని, చదువు విలువ ఏమిటో తనకు బాగా తెలుసన్నారు వంగలపూడి అనిత. గురువారం అనకాపల్లి జిల్లా నక్కపల్లి మంత్రి నివాసం వద్ద హోం మంత్రి అనిత ఆధ్వర్యంలో సైనింగ్ స్టార్స్ అభినందన కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. భారీగా హాజరైన విద్యార్థులు, తల్లిదండ్రులు. ఇటీవల విడుదలైన పదవ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు హోం మంత్రి అనిత. పాయకరావుపేట నియోజకవర్గం నాలుగు మండలాల పరిధిలో పదో తరగతి ఫలితాల్లో ఫస్ట్, సెకండ్ వచ్చిన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్బంగా సన్మానించారు. పేట నియోజకవర్గంలో 103 మంది విద్యార్థులకు, ఒక్కొక్కరికి రూ. 5 వేల చొప్పున సొంత నిధులు విద్యార్థులకు అందచేశారు. నగదు బహుమతితో పాటుగా శాలువాతో సత్కరించి మెమొంటో, సర్టిఫికెట్ ను విద్యార్థులకు ఇచ్చారు. ఉపాధ్యాయులను కూడా ఘనంగా సత్కరించారు.