రూ. 11.47 లక్షల కోట్ల విలువైన 282 ప్రాజెక్టులకు ఆమోదం
ఎస్ఐపీబీ సమావేశంలో పెట్టుబడి ప్రతిపాదనలపై చర్చ
అమరావతి : ఎస్ఐపీబీ ద్వారా ఇప్పటి వరకు రూ. 11.47 లక్షల కోట్ల విలువైన 282 పనులకు ఆమోదం లభించిందని చెప్పారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. గురువారం సచివాలయంలో కీలక సమావేశం జరిగింది. ఈ ముఖ్య మీటింగ్ కు సీఎం అధ్యక్షత వహించారు . పెట్టుబడులు, పారిశ్రామిక ప్రాజెక్టుల పురోగతిపై విస్తృతంగా చర్చించారు. మంత్రుల కమిటీతో కలిసి, విశాఖపట్నం భాగస్వామ్య సదస్సు సందర్భంగా కుదిరిన ఒప్పందాల అమలును, రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక మండలి ఆమోదించిన ప్రాజెక్టులను చంద్రబాబు నాయుడు సమీక్షించారు. కాగా ఇప్పటి వరకు ఆమోదం లభించిన వాటిలో 114 ప్రాజెక్టుల పనులు ఇప్పటికే ప్రారంభం అయ్యాయని చెప్పారు .
ఉద్యోగ కల్పనపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఛైర్మన్ నారా లోకేష్ ముఖ్యమంత్రికి ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ 114 ప్రాజెక్టులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించే దశకు చేరుకున్నాయని, వీటి ద్వారా భారీ ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించ వచ్చని వివరించారు. పెట్టుబడిదారులతో కుదిరిన ఒప్పందాలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, సమర్థవంతంగా అమలు అయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. విశాఖపట్నంలో జరిగిన భాగస్వామ్య సదస్సులో కుదిరిన అవగాహన ఒప్పందాలకు సంబంధించిన ప్రాజెక్టులకు ఆమోదాలను వేగవంతం చేయాలని, అవసరమైన భూ కేటాయింపులను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఈ ప్రాజెక్టులు త్వరగా క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించే దశకు చేరుకునేలా, పరిశ్రమలు తమ కార్యకలాపాలను మొదలుపెట్టేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు .