తాడేపల్లి/అమరావతి : విద్యతో పాటు క్రీడలు విద్యార్థులకు ఎంతో అవసరమని, దీన్ని దృష్టిలో పెట్టుకునే బీసీ గురుకులాలు విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్లు, ట్రాక్ సూట్, షూస్ అందజేయనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. క్రీడలు మానసిక ఉల్లాసం కలిగించడంతో పాటు వాటిలో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో విజేతలుగా నిలిచిన ముగ్గురు క్రీడాకారులు గురువారం కలిశారు. ఈ సందర్బంగా వారిని మంత్రి సవిత అభినందించారు. గత నెల 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకూ రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో ఇండియన్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో గుంటూరుకు చెందిన టి.నాగజ్యోతి 76 కేజీల విభాగంగా జూనియర్ స్థాయిలో పోటీ పడింది. బాలిక 355 కేజీలు ఎత్తి, జాతీయ స్థాయి రికార్డు సాధించి బంగారు పతకం గెలిచుకుంది.
అదే జూనియర్ స్థాయి విభాగంలో పోటీపడిన కె.సత్యరామ్ రాజ్ 53 కేజీల విభాగంలో 110 కేజీలు ఎత్తి జాతీయ స్థాయి రికార్డు సాధించి బంగారు పతకం గెలుచుకున్నాడు. సబ్ జూనియర్ స్థాయి విభాగంగా పోటీపడిన వినోద్ కుమార్ 110 కేజీలు ఎత్తి, జాతీయ స్థాయి రికార్డు సాధించి బంగారు పతకం సాధించాడు. ఈ ముగ్గురు క్రీడాకారులతో పాటు వారికి కోచింగ్ అందజేసిన ఎండీ కమ్రుద్దీన్ ను మంత్రి సవిత అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులతో విద్యతో పాటు క్రీడలు ఎంతో అవసరమన్నారు. క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. క్రీడలతో మానసిక, శారీరక ఉల్లాసం కలుగుతుందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ గురుకులాల విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్లు, ట్రాక్ సూట్ లతో పాటు షూస్ కూడా అందజేయనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు.