వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల‌కు విస్తృత ఏర్పాట్లు

గోవింద రాజ‌స్వామి ఆల‌యంలో మే 23 నుంచి

తిరుప‌తి : తిరుప‌తి లోని శ్రీ గోవింద రాజ‌స్వామి వారి ఆల‌యంలో వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు మే 23 నుంచి 31వ తేదీ వ‌ర‌కు ఘ‌నంగా జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టికే ఏర్పాట్లు చేసింది టీటీడీ. ఉత్స‌వాల‌లో భాగంగా ప్రతిరోజూ ఉదయం 5 గంటలకు సుప్రభాతంతో స్వామి వారి సేవలు ప్రారంభమవుతాయి. ఉదయం 5.30 గంటలకు విశ్వరూప దర్శనం, 6.30 గంటలకు తోమాల సేవ, 7.30 గంటలకు అర్చన, 8 గంటలకు అర్చనానంతర దర్శనం నిర్వహిస్తారు. రాత్రి 8.30 గంటలకు ఏకాంత సేవతో నిత్య కార్యక్రమాలు ముగుస్తాయి. ఈ సేవల్లో పాల్గొనే భక్తులు అపార ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతున్నారు.

శ్రీ గోవిందరాజ స్వామివారిని దర్శించుకునే భక్తులకు ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు చక్కెర పొంగలి, అన్నం, సాంబారు, రసం, కర్రీ, చట్నీ, మజ్జిగతో రుచికరమైన భోజనం వడ్డిస్తున్నారు. అదేవిధంగా, ఆలయం సమీపంలోని పాత మ్యూజియంలో ప్రతిరోజూ ఉచిత అన్న ప్రసాదాలను అందిస్తున్నారు. 2026 ఫిబ్రవరి నెల నుండి సాయంత్రం 6.30 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు సాంబారు అన్నం, పెరుగు అన్నం కూడా పంపిణీ చేస్తున్నారు.

ఆలయంలోకి ప్రవేశించగానే దర్శనమిచ్చే ఏడు అంతస్తుల మహారాజగోపురం విజయనగర శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది. స్థానిక పాలకుడు మట్ల అనంతరాజు నిర్మించిన ఈ గోపురం ద్రావిడ, విజయనగర నిర్మాణ శైలుల సమ్మేళనంగా శతాబ్దాలుగా భక్తులను ఆకట్టుకుంటోంది. మూడు అంతస్తులతో నిర్మించిన పడి కావిలి గోపురం, మహాద్వార గోపురం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుండగా, విమాన గోపురం బంగారు తాపడంతో దివ్య కాంతులను విరజిమ్ముతోంది.

ఆలయంలో 70 సంవత్సరాల క్రితం ప్రతిష్టించిన పాత ధ్వజస్తంభం స్థానంలో 2018 ఏప్రిల్ 7న నూతన ధ్వజస్తంభాన్ని ప్రతిష్టించారు. అనంతరం 2018 ఏప్రిల్ 12న వైఖానస ఆగమోక్తంగా మహాసంప్రోక్షణ నిర్వహించారు. ఆలయ విమాన గోపురానికి 100 కిలోల బంగారంతో తాపడం పనులను 2021 సెప్టెంబర్ 14న ప్రారంభించి, 2023 మే 25న బంగారు తాపడం విమాన గోపుర మహాసంప్రోక్షణను అత్యంత వైభవంగా నిర్వహించారు.

Leave A Reply

Your Email Id will not be published!