హీట్ వేవ్ పై రాష్ట్ర వ్యాప్తంగా అప్రమత్తత : సీఎం

ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటే సెలవుల ప్రకటన

అమరావ‌తి : రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో నమోదు అవుతున్న ఉష్ణోగ్రతలు, వడ గాల్పుల నేపథ్యంలో ప్రజారోగ్యం, వారి భద్రతపై ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఎండల తీవ్రత దృష్ట్యా అధికార యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ప్రజలను రక్షించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్న ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు నిరంతరం హెచ్చరికలు పంపాలని అధికారులకు సూచించారు. ఎండల తీవ్రత మరీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పరిస్థితులను బట్టి స్థానికంగా సెలవులు ప్రకటించాలని దిశా నిర్దేశం చేశారు. తీవ్రస్థాయి ఎల్ నినో కారణంగా హీట్ వేవ్ తీవ్రత కూడా గణనీయంగా పెరిగిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దీనిపై స్పందించిన సీఎం ప్రజలకు ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేలా రద్దీగా ఉన్న ప్రాంతాలు, ప్రజలు ఎక్కువగా తిరిగే చోట్ల చల్లని మంచినీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు.

వడగాలుల నుంచి ఎలా రక్షించు కోవాలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా కలెక్టర్లు మీడియా సమావేశాలు నిర్వహించాలని సూచించారు. మీడియాతో పాటు సామాజిక మాధ్యమాల ద్వారా నిరంతరం సమాచారాన్ని చేర వేయాలని నిర్దేశించారు. ప్రజల ప్రాణాలే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని, ఎండ తీవ్రత నేపథ్యంలో బయటకు వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, చిన్నారులు, అనారోగ్యంతో ఉన్నవారు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రాకుండా ఉండాలని సూచించారు. ఈ అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి జిల్లా కలెక్టర్లు, మండల స్థాయి అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో 1349 హీట్ షెల్టర్లు, చలి వేంద్రాలు ఏర్పాటు చేసినట్టు అధికారులు సీఎంకు వివరించారు. 446 ట్రాఫిక్ జంక్షన్లలో వాహనదారులు, పోలీసులకు నీడ కల్పించేలా ఏర్పాట్లు చేశామని తెలియచేశారు. మరోవైపు ఎండ తీవ్రతతో ఇబ్బందులు పడుతున్న మూగ జీవులు, పక్షులకు కూడా నీటి తొట్టెలు, మట్టి కుండలతో నీటిని ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు.

Leave A Reply

Your Email Id will not be published!