సింహ వాహనంపై అభయమిచ్చిన కల్యాణ వేంకటేశ్వరుడు

దుష్టశిక్షణ–శిష్టరక్షణ ధర్మాన్ని చాటిన దివ్య విహారం

తిరుపతి : నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన శనివారం ఉదయం సింహ వాహనంపై సుదర్శన నరసింహుడి అలంకారంలో శ్రీనివాసుడు భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. అనంత తేజోమూర్తిగా వెలసిన స్వామి వారు సింహ వాహనాన్ని అధిరోహించి దుష్టశిక్షణ, శిష్టరక్షణ ధర్మాన్ని చాటి చెప్పారు. పరాక్రమం, ధైర్యం, తేజస్సు, ఆధిపత్యానికి ప్రతీకైన సింహరూప దర్శనంతో భక్తులు ఆధ్యాత్మిక పారవశ్యంలో మునిగి పోయారు.

వాహనం ముందు భక్త బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో గోవింద నామస్మరణ చేస్తుండగా, మంగళ వాయిద్యాల నడుమ వాహనసేవ అత్యంత వైభవంగా సాగింది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి స్వామివారి కటాక్షాన్ని పొందారు. సింహ వాహనోత్సవం ద్వారా అజ్ఞానాన్ని తొలగించి ధర్మ మార్గంలో నడవాలని, విజయ స్ఫూర్తితో జీవించాలని శ్రీవారు సందేశమిచ్చారు. ఈ రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు.

వాహనసేవలో ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, సూపరింటెండెంట్ శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ నాగరాజు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!