తిరుపతి : తిరుపతి లోని శ్రీ గోవిందరాజ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన శనివారం రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గోవింద నామ స్మరణలతో తిరువీధులు మార్మోగగా, వేలాది మంది భక్తులు భక్తి శ్రద్ధలతో రథాన్ని లాగి తమ భక్తిని చాటుకున్నారు. ఉదయం 5.40 గంటలకు ప్రారంభమైన రథోత్సవం కర్ణాల వీధి, బేరి వీధి, గాంధీ రోడ్డు మీదుగా తిరిగి ఆలయ రథ మండపానికి చేరుకుంది. మార్గమంతా భక్తులు టెంకాయలు కొట్టి, కర్పూర హారతులు సమర్పిస్తూ స్వామి వారికి మంగళ హారతులు అర్పించారు.
రథోత్సవం కేవలం ఉత్సవం మాత్రమే కాదు, ఆత్మజ్ఞానాన్ని బోధించే మహత్తర తాత్త్విక సందేశం కూడా. ఆత్మను రథికుడిగా, శరీరాన్ని రథంగా, బుద్ధిని సారథిగా, మనసును పగ్గంగా, ఇంద్రియాలను గుర్రాలుగా, విషయాలను వీధులుగా భావించడం ద్వారా ఆత్మ–అనాత్మ వివేకాన్ని ఈ ఉత్సవం భక్తులకు బోధిస్తుంది. రథోత్సవం అనంతరం ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవింద రాజస్వామి వారికి, నమ్మాళ్వార్ల ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చందనం, వివిధ పండ్లరసాలతో విశేష అభిషేకం చేశారు.
సాయంత్రం 5.30 నుండి 6 గంటల వరకు ఊంజల్‌సేవ నిర్వహించారు. అనంతరం రాత్రి 7 నుండి 9 గంటల వరకు అశ్వ వాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనం ఇచ్చారు. రథోత్సవంలో శ్రీ శ్రీ శ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి, టీటీడీ బోర్డు సభ్యులు జి. భానుప్రకాశ్ రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, ఏఈవో ఏబీ నారాయణ చౌదరి, ఆలయ అధికారులు, ఇంజినీరింగ్ అధికారులు, పోలీసు అధికారులు, శ్రీవారి సేవకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
