బెంగళూరు : కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. మూడేళ్ల పాటు సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన సిద్దరామయ్య ఉన్నట్టుండి తాను తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా లేఖను గవర్నర్ ఆమోదించారు. ఉన్న మంత్రి మండలి రద్దయిందని, కొత్తగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అంత వరకు తాత్కాలిక సీఎంగా సిద్దరామయ్య వ్యవహరిస్తారని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కొత్తగా సీఎల్పీ నేతను శనివారం ఎన్నుకునేందుకు సమావేశం అయ్యారు. అందరి కళ్లు దీనిపైనే ఉన్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలి పోయింది. ఓ వర్గం సిద్దరామయ్యది కాగా మరో వర్గం డీకే శివకుమార్ కు చెందినది.
సిద్ధరామయ్య తర్వాత కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే కొత్త నాయకుడిని ఎన్నుకోవడానికి కాంగ్రెస్ శాసనసభ పక్షం సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎల్పీకి కొత్త నాయకుడిగా డీకే శివకుమార్ ఎన్నికవుతారని భావిస్తున్నారు. శాసనసభ్యులందరూ సాయంత్రం 4 గంటలకు విధానసౌధలోని సమావేశ మందిరంలో జరిగే సమావేశానికి హాజరు అయ్యారు. ఈ సమావేశాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్ , రణదీప్ సింగ్ నూర్జేవాలా పర్యవేక్షించారు. కాగా తదుపరి నాయకుడిని ఎంపిక చేసే అధికారాన్ని కాంగ్రెస్ అధిష్టానానికి అప్పగిస్తూ ఒక ఏకవాక్య తీర్మానాన్ని ఆమోదించారు. కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఆదివారం లేదా సోమవారం జరిగే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం.
