బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ జూన్ 3న ప్రమాణ స్వీకారం చేపట్టనున్నారు. ఆయన రాష్ట్రంలోని కనకపుర నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2023 ఎన్నికల్లో, శివకుమార్ తన సమీప ప్రత్యర్థ జనతా దళ్ సెక్యులర్ పార్టీకి చెందిన బి. నాగరాజుపై 1,22,392 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. భారతీయ జనతా పార్టీ తరపున అప్పటి ప్రతిపక్ష నాయకుడు ఆర్. అశోక్ పోటీలో బరిలో ఉన్నప్పటికీ ఆయనకు కేవలం 19,753 ఓట్లతో మూడవ స్థానంలో నిలిచారు. అయితే అశోక్ బెంగళూరులోని పద్మనాభనగర్ అసెంబ్లీ స్థానం నుండి కూడా పోటీ చేసి గెలుపొందారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు డి.కె. శివకుమార్ నియోజకవర్గ అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.
ఇంధన శాఖ మంత్రిగా రైతులకు ట్రాన్స్ఫార్మర్ల పంపిణీ, స్థానిక యువతకు ఉపాధి కల్పన, కనకపుర పట్టణంలో ఒక అత్యాధునిక స్టేడియం నిర్మాణం, ప్రసూతి ఆసుపత్రి ఏర్పాటు వంటి అనేక కార్యక్రమాలు చేపట్టడం ద్వారా 2023 ఎన్నికల్లో డీకే శివకుమార్ సాధించిన భారీ విజయానికి అవి ఎంతగానో దోహద పడ్డాయని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. 43 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కనకపుర అసెంబ్లీ నియోజకవర్గం నుండి రెండవ ముఖ్యమంత్రిగా డి.కె. శివకుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు.ఆ రోజే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి సర్వం సిద్ధమైంది. గతంలో దివంగత ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే జనతా పార్టీ అభ్యర్థిగా ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహించి, 1983లో జరిగిన కనకపుర ఉప ఎన్నికలో విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు.
సంతనూరు, కనకపుర అసెంబ్లీ స్థానాల విలీనం జరిగినప్పటి నుండి, డి.కె. శివకుమార్ వరుసగా 2008, 2013, 2018 , 2023 ఎన్నికల్లో విజయం సాధించారు. ఈ రెండు అసెంబ్లీ స్థానాల విలీనానికి ముందు, శివకుమార్ సంతనూరు అసెంబ్లీ స్థానం నుండి 1989, 1994, 1999 , 2004 ఎన్నికల్లో గెలుపొందారు.
