న్యూఢిల్లీ : కేంద్రంలోని బీజేపీతో కూడిన ఎన్డేయే సర్కార్ తీపి కబురు చెప్పింది. మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడంపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా రైల్వే శాఖ కు సంబంధించి కీలక ప్రకటన చేశారు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. శనివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే దేశంలోని ప్రముఖ నగరాలను కలుపుతూ బుల్లెట్ ట్రైన్లు నడుస్తున్నాయని, ప్రతి రోజూ వేలాది మందిని తమ గమ్య స్థానాలను చేర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. ఇందులో భాగంగా ఇవాళ కీలక సమావేశం జరిగిందని తెలిపారు. ఇందులో 7 ప్రధాన బుల్లెట్ ట్రైన్లకు ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ ఆమోదం తెలిపారని చెప్పారు.
ఇందులో ప్రధానంగా ముంబై, అహ్మదాబాద్ , పూణే , బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ , లక్నో, వారణాసి, తదితర నగరాల మధ్య ఈ బుల్లెట్ ట్రైన్లు నడుస్తాయని వెల్లడించారు అశ్విని వైష్ణవ్. ముంబై అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్ 1 గంట 57 నిమిషాలలో చేరుకుంటుందన్నారు. ఇక ముంబై పూణే నగరాల మధ్య బుల్లెట్ ట్రైన్ కేవలం 48 నిమిషాలలో చేరుస్తుందన్నారు వైష్ణవ్. బెంగళూరు చెన్నై మధ్య ఒక గంట 13 నిమిషాలు, బెంగళూరు హైదరాబాద్ మధ్య 2 గంటల 10 నిమిషాలు, పూణే హైదరాబాద్ మధ్య 2 గంటల 8 నిమిషాలు, ఢిల్లీ లక్నో మధ్య 2 గంటలు , ఢిల్లీ వారణాసి మధ్య 3 గంటల 15 నిమిషాలు, ఢిల్లీ సిలిగురి మధ్య 6 గంటల సమయం పడుతుందని చెప్పారు కేంద్ర మంత్రి. ఇదే సమయంలో ఆయా బుల్లెట్ ట్రైన్లను ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు తమకు కావాలని విన్నవించాయని తెలిపారు. ఆ మేరకు వారి వినతులు పరిగణలోకి తీసుకుని పీఎం ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు అశ్విని వైష్ణవ్.