తిరుపతి : సకల సంపదలకు అధిష్ఠాన దేవత అయిన శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించే పవిత్రమైన శ్రీ మహాలక్ష్మీ దీప పూజ కార్యక్రమం తిరుపతిలోని శ్రీ రామచంద్ర పుష్కరిణి వద్ద భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా టీటీడీ జేఈవో డాక్టర్ శరత్ మాట్లాడారు. ప్రజలందరూ సుఖ సంతోషాలు, ఐశ్వర్యాలతో జీవించాలని సంకల్పించి టీటీడీ అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తోందని చెప్పారు. ఎస్‌వీబీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ మహాలక్ష్మీ దీప పూజ భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తోందని అన్నారు. ఇకపై ప్రతి నెల రెండో శుక్రవారం వివిధ ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.
టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ దీపం వెలిగే చోట శుభం, ఐశ్వర్యం నెలకొంటాయని అన్నారు. భక్తుల భాగస్వామ్యంతో టీటీడీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం విశేష ఆదరణ పొందుతోందన్నారు . బోర్డు సభ్యురాలు పనబాక లక్ష్మీ మాట్లాడుతూ, టీటీడీ చేపడుతున్న ధార్మిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయని తెలిపారు. తిరుపతి ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం ఆనంద దాయకమన్నారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి డాక్టర్ మేడసాని మోహన్ మాట్లాడుతూ దీపం జ్ఞానానికి, శుభానికి, ఐశ్వర్యానికి ప్రతీక అని చెప్పారు. మహాలక్ష్మీ దీప పూజ ద్వారా కుటుంబాల్లో సుఖశాంతులు, సమృద్ధి నెలకొనాలని ఆకాంక్షించారు.
అనంతరం అర్చకులు శాస్త్రోక్తంగా విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, దీపలక్ష్మీ ఆరాధన, అష్టోత్తర శతనామార్చన నిర్వహించారు. వేద మంత్రోచ్చారణలు, లక్ష్మీ స్తోత్ర పారాయణాలు, వేలాది దీపాల వెలుగులతో ఆధ్యాత్మిక వాతావరణం అలరించింది. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఆలపించిన భక్తి సంకీర్తనలు భక్తులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమం చివరగా నక్షత్రహారతి, కుంభహారతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, స్విమ్స్ డైరెక్టర్ డా. ఆర్వీ కుమార్, సీపీఆర్వో డాక్టర్ టి. రవి, అర్చక బృందం, వేద పండితులు, అధికారులు, భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.