అమరావతి : మన సంస్కృతి, విలువలే భారతదేశాన్ని ప్రపంచానికి విశ్వ గురు స్థానంలో నిలిపాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న సంస్కృతి, విలువలను కాపాడుకుని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని సూచించారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం ఉండవల్లి గుహల వద్ద బాబా రామ్ దేవ్ నిర్వహించిన యోగా సాధన కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు. యోగాంధ్ర లోగో ఉన్న చొక్కాను ధరించి ముఖ్యమంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాబా రామ్ దేవ్ నేతృత్వంలో జరిగిన యోగభ్యాసాన్ని ముఖ్యమంత్రి తిలకించారు. ఈ సందర్భంగా వివిధ రకాల యోగాసనాలను సీఎం చంద్రబాబుకు రామ్ దేవ్ వివరించారు. సీఎం చంద్రబాబు ఎదుట చక్రాసనం, వృశ్చికాసనం, మయూరాసనం, హనుమానాసనం, రాజ్ కపోతాసనం, పవర్ యోగా వంటి ఆసనాలను రామ్ దేవ్ ప్రదర్శించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ బాబా రామ్ దేవ్‌తో నాకు 30 ఏళ్ల నుంచి పరిచయం ఉంది. రామ్ దేవ్ బాబా యోగాను ప్రజల్లోకి తీసుకెళ్లారు. వేలాది మంది స్వచ్ఛంధంగా వచ్చి రామ్ దేవ్ బాబా దగ్గర యోగాలో శిక్షణ తీసుకుంటారు. యోగాను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లిన రామ్ దేవ్ బాబాకు దేశ ప్రజల తరపున కృతజ్ఞతలు. నేను 30 ఏళ్ల నుంచి టెక్నాలజీని ప్రమోట్ చేస్తున్నాను… రామ్ దేవ్ బాబా యోగాను ప్రమోట్ చేస్తున్నారు. టెక్నాలజీ వితవుట్ అడిక్షన్ అనే విధానంలో వెళ్లాలి… దీనికి ఆధ్యాత్మిక, యోగా వంటివి ఉపకరిస్తాయి. యోగాతో శరీరం, మెదడు అనుసంధానం అవుతాయి. అమరావతి, విజయవాడల్లోని వివిధ ప్రాంతాల్లో యోగాభ్యాసం చేస్తూ.. మీడియా ద్వారా ప్రచారం చేయడానికి సంకల్పించిన రామ్ దేవ్ బాబాకు ధన్యవాదాలు.
ఏపీని దేశానికి ఆథ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలని బాబాను కోరుతున్నాను. యోగా సాధన కోసం ఉద్యమ స్పూర్తితో పని చేయాలి. ప్రస్తుత తరానికి యోగా సాధనను అలవాటు చేస్తే అద్భుతమైన భవిష్యత్తును అందించినట్టేనని సీఎం అన్నారు. యోగాకు ప్రాచుర్యం లభించేలా చేయడంతోపాటు… రాష్ట్రంలోని వివిధ ఆథ్యాత్మిక, పర్యాటక ప్రాంతాల్లో యోగాంధ్ర నిర్వహిస్తున్నాం అని తెలిపారు. దాంట్లో భాగంగా ఉండవల్లి గుహల వద్ద యోగా సాధన చేయడం విశేషం. 6-7 శతాబ్దాలకు చెందిన ఉండవల్లి గుహలకు చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాశస్త్యం ఉంది. పద్మనాభ స్వామి ఈ ఉండవల్లి గుహల్లో కొలువై ఉన్నాడు అని ముఖ్యమంత్రి చెప్పారు.