ఏపీని ప‌ర్యాట‌క రంగానికి కేరాఫ్ గా మారుస్తాం

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన మంత్రి కందుల దుర్గేష్

అమరావతి: రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. గురువారం సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ప్రతినిధి బృందం మంత్రి దుర్గేష్ ని కలిసి రాష్ట్రంలో పర్యాటక రంగ బలోపేతానికి, పెట్టుబడుల ఆకర్షణకు సంబంధించిన పలు కీలక సూచనలతో కూడిన వినతిపత్రాన్ని అందించింది.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ప్రగతిశీల కార్యక్రమాలను ఏపీ ఛాంబర్స్ ప్రతినిధులు కొనియాడారు. ముఖ్యంగా ఏపీ పర్యాటక విధానం 2024-29, ఏపీ పర్యాటక భూమి కేటాయింపు విధానం, కార్యాచరణ మార్గదర్శకాలు, బీచ్ షాక్ విధానం, ‘హాలిడే ఇన్ ఏపీ / విజిట్ ఏపీ’ గ్లోబల్ ప్రచారం తదితర నిర్ణయాలు పర్యాటక రంగ పెట్టుబడిదారులలో నమ్మకాన్ని రెట్టింపు చేశాయని, ఆర్థిక వృద్ధికి బలమైన పునాది వేశాయని మంత్రి దుర్గేష్‌కు ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. పర్యాటక మంత్రిగా ఆయన పనితీరును ప్రశంసించారు.

ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ త్వరలోనే రాష్ట్రంలో టూర్ ఆపరేటర్లు,ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ , ఇండస్ట్రీ ఫెడరేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామని అన్నారు. “రాబోయే సెప్టెంబర్‌లో నిర్వహించనున్న ‘ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్’ సమావేశానికి సంబంధించి అవసరమైన అధ్యయనం చేసి, నివేదికను సిద్ధం చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.” జూలై రెండవ వారంలో పర్యాటక శాఖతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, ఆ తదనంతరం తీసుకునే నిర్ణయాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల దృష్టికి తీసుకెళ్లి వారి మార్గదర్శకాలతో ముందుకు సాగుతామని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు.

Leave A Reply

Your Email Id will not be published!