శ్రీవారి వైభవాన్ని విశ్వ వ్యాప్తం చేస్తాం : బీఆర్ నాయుడు
విద్య, వైద్యం, ధార్మిక సేవలకు పెద్దపీట వేస్తామన్న చైర్మన్
తిరుపతి : ప్రపంచ నలుమూలల నుంచి తిరుమలకు విచ్చేసే శ్రీవారి భక్తుల సేవే టీటీడీ ప్రధాన ధ్యేయమని, సనాతన ధర్మ పరిరక్షణే తమ సంకల్పమని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు . శ్రీవారి స్పవైభవాన్ని విశ్వ వ్యాప్తం చేస్తూ, విద్య, వైద్యం, ధార్మిక సేవలకు పెద్దపీట వేస్తూ అభివృద్ధిలో వేగం, సేవల్లో నిబద్ధతతో టీటీడీ ముందుకు సాగుతోందని అన్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామివారి దివ్య కైంకర్యాల్లో సేవలందిస్తున్న అర్చక స్వాములు, భక్తుల సేవలో తరిస్తున్న ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు, ఉద్యోగులు, భద్రతా సిబ్బంది, విశ్రాంత ఉద్యోగులు, శ్రీవారి సేవకులు, మీడియా మిత్రులు, అలాగే దేశ విదేశాల నుంచి తిరుమలకు విచ్చేస్తున్న భక్తకోటికి శుభాకాంక్షలు తెలిపారు. మానవ సేవయే మాధవ సేవ అనే ఆదర్శంతో భక్తులకు మరింత మెరుగైన సేవలు అందిస్తూ, సనాతన ధర్మ పరిరక్షణలో టీటీడీ ఎల్లప్పుడూ అంకితభావంతో ముందుంటుందని పేర్కొన్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో ప్రతి భక్తుడు శ్రీవారి దివ్య దర్శనానంతరం దివ్యానుభూతితో తిరిగి వెళ్లేలా సేవలను మరింత మెరుగు పరచడమే లక్ష్యంగా టీటీడీ బోర్డు, యంత్రాంగం పని చేస్తున్నదని చెప్పారు.
జీయంగార్లు, ఆగమశాస్త్ర పండితుల మార్గదర్శకత్వంలో శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ ఆధ్వర్యంలోని అన్ని ఆలయాల్లో నిత్య కైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహిస్తున్నాం అన్నారు చైర్మన్. ఈ ఏడాది అధికమాసం కారణంగా సెప్టెంబరు 15 నుండి 23వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అదేవిధంగా అక్టోబరు 12 నుంచి 20వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే ప్రతి భక్తుడు శ్రీవారి దివ్య దర్శనం, వాహన సేవలను భక్తిశ్రద్ధలతో వీక్షించేలా సమగ్ర ఏర్పాట్లతో పాటు దేశ వ్యాప్తంగా సంప్రదాయ కళా ప్రదర్శనలను మరింత వైభవంగా నిర్వహిస్తాం అన్నారు. “అన్నదానం మహాదానం” స్ఫూర్తితో లక్షలాది మంది భక్తులకు పరిశుభ్రమైన, నాణ్యమైన అన్నప్రసాదం అందించేందుకు దాతల సహకారంతో రూ.120 కోట్లతో మరొక వంటశాలను నిర్మించాలని నిర్ణయం తీసుకున్నాం అని వెల్లడించారు.
తిరుమలను ఒక అద్భుతమైన పర్యావరణ ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చడంలో భాగంగా దాతల సహాకారంతో ప్రస్తుతం ఉన్న 12 ఎలక్ట్రిక్ బస్సులకు అదనంగా మరో 32 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టి, భక్తులకు పర్యావరణ హితమైన, సౌకర్యవంతమైన రవాణా సేవలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం అని తెలిపారు. దాతల సహాకారంతో రూ.145 కోట్లతో అభివృద్ధి చేసిన తిరుమల ఎస్వీ మ్యూజియంలో శ్రీవారి సేవలు, ఉత్సవాలు, అరుదైన ఆభరణాల వైభవాన్ని 3డీ, 7డీ రూపంలో భక్తులకు త్వరలో అందుబాటులోకి తీసుకు వస్తామని తెలిపారు.శ్రీ కోదండ రామస్వామివారి ఆలయాన్ని ఆధ్యాత్మిక వైభవానికి తగినట్లుగా తీర్చి దిద్దేందుకు విశ్రాంతి గృహాలు, యాత్రికుల సౌకర్యాలు, విద్యుత్ అలంకరణలు, భూసేకరణ తదితర అభివృద్ధి పనులను వేగంగా చేపట్టి, ఒంటిమిట్టను మరింత ప్రముఖ పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేస్తున్నాం అన్నారు.
శ్రీవారి వైభవాన్ని విశ్వ వ్యాప్తం చేయాలనే సంకల్పంతో దేశవ్యాప్తంగా టీటీడీ ఆలయాల నిర్మాణాన్ని వేగవంతం చేస్తోందని చెప్పారు బీఆర్ నాయుడు. తమిళనాడులోని కోయంబత్తూరులో 19.62 ఎకరాలు, అస్సాంలోని గౌహతిలో 10.32 ఎకరాలు, తెలంగాణలోని ఖమ్మంలో 20 ఎకరాలు, కర్ణాటకలోని బెల్గాంలో 6.43 ఎకరాలు, ముంబైలోని బాంద్రా ప్రాంతంలో అదనంగా మరో 10 సెంట్లు, అదేవిధంగా బీహార్ రాష్ట్రంలో కూడా భూమిని సేకరించి శ్రీవారి ఆలయాల నిర్మాణ పనులను ముందుకు తీసుకెళుతున్నాం అన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతిలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని రూ.140 కోట్లతో మహారాజగోపురం, పుష్కరిణి, వాహన మండపం, తదితర నిర్మాణాలతో అభివృద్ధి చేస్తున్నాం అని తెలిపారు.
తిరుచానూరు, శ్రీగోవిందరాజస్వామి, శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయాలతో పాటు టీటీడీ ఆధ్వర్యంలోని అన్ని స్థానిక ఆలయాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తున్నాం అన్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ఆలయాలకు ధూప, దీప, నైవేద్యాల కోసం అందిస్తున్న ఆర్థిక సాయాన్ని రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచామని తెలిపారు. టీటీడీ ట్రస్టులు, పథకాలకు విరాళాలు అందించే దాతలకు మరింత పారదర్శకతతో కూడిన ఏకీకృత ప్రివిలేజెస్ను అమలు చేసేందుకు చర్యలు తీసుకున్నాం అన్నారు. గత రెండేళ్లుగా టీటీడీలోని వివిధ ట్రస్టులకు సుమారు రూ.1500 కోట్లకు పైగా విరాళాలు అందించిన ప్రతి దాతకు టీటీడీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియ జేస్తున్నానని తెలిపారు. టీటీడీకి చెందిన 64 స్థానిక, అనుబంధ ఆలయాల్లో శ్రీవారి స్వచ్ఛంద సేవ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయడం జరిగిందన్నారు.
అదేవిధంగా టీటీడీ ఆసుపత్రుల్లో శ్రీవారి వైద్యసేవను మరింత విస్తరించి, ఎక్కువ మంది రోగులకు నిస్వార్థంగా, నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టామన్నారు చైర్మన్. రూ.161.40 కోట్లతో టీటీడీ విద్యా సంస్థలను ప్రపంచ స్థాయి విద్యా కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఆధునిక మౌలిక వసతులు, అత్యుత్తమ విద్యతో పాటు భారతీయ సంస్కృతి, నైతిక విలువలు, క్రమశిక్షణను విద్యార్థుల్లో పెంపొందించి, సమాజానికి ఆదర్శవంతమైన భావి పౌరులను తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. టీటీడీ విద్యా సంస్థల్లో 10వ తరగతి, ఇంటర్మీడియట్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 147 మంది విద్యార్థులకు “ప్రతిభా పురస్కారాలు” అందించి, విద్యార్థులు మరింత ఉన్నత లక్ష్యాలను సాధించేలా ప్రోత్సహించాం అన్నారు.
కొన్ని దశాబ్దాలుగా టిటిడి వైద్య రంగంలో సేవలు అందిస్తోందని, తిరుపతిలోని స్విమ్స్, బర్డ్ ఇతర ఆసుపత్రుల్లో వైద్య సౌకర్యాలు పెంచడం ద్వారా పేదరోగులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. చిన్నారులకు ప్రపంచ స్థాయి వైద్య సేవలందించే శ్రీ పద్మావతి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి త్వరలోనే అందుబాటులోకి తీసుకు వస్తాం అని ప్రకటించారు చైర్మన్. స్విమ్స్ ఆసుపత్రిలో రోగులకు మరింత నాణ్యమైన, వేగవంతమైన వైద్య సేవలు అందించేందుకు వివిధ విభాగాల్లో అవసరమైన ఉద్యోగ నియామకాలు చేపట్టాం అన్నారు.
వివిధ ధార్మిక ప్రాజెక్టులు, వేద-భక్తి కార్యక్రమాల ద్వారా సనాతన హిందూ ధర్మాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసి, భావితరాలకు ఆధ్యాత్మిక విలువలను చేరవేస్తున్నాం అని తెలిపారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్, దాస సాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టు, ఎస్వీ సంగీత నృత్య కళాశాల తదితర విభాగాల్లో సేవలందిస్తున్న కళాకారుల నైపుణ్యాన్ని గుర్తించి, వారి పారితోషికాన్ని పెంచేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. సనాతన ధర్మాన్ని క్షేత్రస్థాయికి మరింత విస్తరించేందుకు వివిధ ధార్మిక సంస్థలకు టీటీడీ ఆర్థిక సహాయం అందిస్తోందన్నారు. ధర్మ ప్రచారం, ఆధ్యాత్మిక చైతన్యం, భారతీయ సంస్కృతి పరిరక్షణకు ఈ సహకారం ఎంతో దోహద పడుతోందన్నారు. వేద పారాయణ పథకం ద్వారా 791 మంది వేద పండితులను ప్రోత్సహిస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో నిత్య వేదపారాయణం కొనసాగి సనాతన ధర్మ వైభవం చిరస్థాయిగా నిలిచేలా కృషి చేస్తున్నాం అని తెలిపారు.
జూన్ 21న అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని “యోగ–టీటీడీ ఆరోగ్యానంద” కార్యక్రమాన్ని తిరుపతిలో 17 కేంద్రాల్లో 14 రోజులపాటు నిర్వహించి, ఉద్యోగులు, విద్యార్థుల్లో శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఆత్మ విశ్వాసం పెంపొందేలా ప్రతిరోజూ యోగ శిక్షణ అందించాం అన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే తప్పుడు ప్రచారాలను టీటీడీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదని హెచ్చరించారు చైర్మన్ . అసత్యాలను అరికట్టి, భక్తుల విశ్వాసాన్ని పరిరక్షించేందుకు చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటున్నాం అన్నారు.
