పొగాకు గిట్టుబాటు ధరకు కూటమి స‌ర్కార్ భరోసా

మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు టెలీ కాన్ఫరెన్స్

అమరావతి : వర్జీనియా (FCV) పొగాకు రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా కొనుగోలు ప్రక్రియను జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షించాలని, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సరాసరి ధర కిలోకు రూ.200 కంటే తక్కువ ధరకు కొనుగోళ్లు జరిగేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వొద్దని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మంత్రి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పొగాకు కొనుగోళ్లు, రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితులు, ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన ఎరువుల లభ్యత, పంపిణీ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. పొగాకు కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, కంపెనీలు నిర్ణయించిన నిబంధనలకు లోబడి పారదర్శకంగా కొనుగోళ్లు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ఖరీఫ్ సీజన్ దృష్ట్యా రాష్ట్రంలో యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ సహా అన్ని రకాల ఎరువులు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని, రైతులకు అవసరమైన సమయంలో ఎరువులు అందేలా నిల్వలు, రవాణా, పంపిణీపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని అన్నారు. కృత్రిమ కొరత, నిల్వదాచివేత, అధిక ధరలకు విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన పొగాకు బోర్డు 168వ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కూడా మంత్రి ప్రస్తావించారు. 2026–27 పంట సంవత్సరానికి మార్కెట్ పరిస్థితులు, దేశీయ, అంతర్జాతీయ డిమాండ్, రైతుల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్‌లో FCV (Flue Cured Virginia) పొగాకు ఉత్పత్తి పరిమాణాన్ని సుమారు 81 మిలియన్ కిలోలకు నిర్ణయించినట్లు తెలిపారు.

Leave A Reply

Your Email Id will not be published!