గజ వాహనంపై సిరుల తల్లి దివ్య మంగళ విహారం

తెప్పపై భక్తులను అభయపరచిన శ్రీ పద్మావతి అమ్మవారు

తిరుపతి : తిరుచానూరులో జరుగుతున్న శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా అమ్మవారు పద్మ పుష్కరిణిలో తెప్పపై విహరించి భక్తులకు దివ్య మంగళ దర్శనమిచ్చారు. అనంతరం గజవాహనంపై ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి, సహస్ర నామార్చన, నిత్యార్చనలు నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4.30 గంటల వరకు పద్మ పుష్కరిణి వద్దనున్న నీరాడ మండపంలో శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించారు.

సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమైన తెప్పోత్సవంలో అమ్మవారు ఐదు చుట్లు తిరిగి భక్తులకు అభయప్రద దర్శనం ఇచ్చారు. అనంతరం గజవాహనంపై ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు ఆశీస్సులు అందించారు. ఇదిలా ఉండ‌గాఇవాల్టితో వార్షిక తెప్పోత్సవాలు ముగియనున్నాయి. ఈ సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారు పద్మ పుష్కరిణిలో ఏడు చుట్లు తిరిగి భక్తులను అనుగ్రహించనున్నారు. అనంతరం గరుడ వాహనంపై అమ్మవారు మాడవీధుల్లో విహరించి భక్తులను ఆశీర్వదించనున్నారు.

ఈ కార్యక్రమంలో జేఈవో డా. ఎం. శరత్, డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, సూపరింటెండెంట్లు రమేష్, సురేష్, ముని చెంగల్రాయులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ చలపతి, ఆలయ అర్చకులు, శ్రీవారి సేవకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!