చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొన్నేళ్లుగా వారసత్వ రాజకీయాలతో, రెండు పార్టీల నిర్వాకంతో ప్రజలు విసిగి పోయారని అన్నారు. ఇవాళ సీఎం మీడియాతో మాట్లాడారు. పారదర్శకమైన పాలన అందించడానికే ప్రజలు మాకు ఓటు వేశారని చెప్పారు. కొండ ప్రాంతాల్లో అక్రమ సారా తయారీని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూనే, మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు, వాటికి ఉన్న డిమాండ్‌ను తొలగించేందుకు ఆరోగ్య శాఖ ద్వారా అన్ని జిల్లాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. పారదర్శకమైన, నిజాయితీతో కూడిన , అవినీతి రహిత పాలనను చూడాలనే ఆకాంక్షతోనే ప్రజలు ప్రస్తుత ప్రభుత్వానికి ఓటు వేశారని పేర్కొన్నారు.
మహిళలపై జరిగే నేరాల పట్ల అధికారులు , పోలీసులు కఠినంగా వ్యవహరించాలని, (జీరో టాలరెన్స్), పోక్సో కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో ఎటువంటి జాప్యం జరగకూడదని స్పష్టం చేశారు సీఎం . చెన్నైలో జిల్లా కలెక్టర్లు మరియు పోలీసు అధికారుల రెండు రోజుల వార్షిక సమావేశాన్ని ప్రారంభించారు. మహిళల భద్రత అత్యంత ముఖ్యమని అన్నారు. వారి రక్షణ కోసం చేసిన ప్రత్యేక ఏర్పాట్లలో ఎటువంటి మార్పులు లేదా రాజీ ఉండ కూడదని, దీనిని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు (పోలీసు సూపరింటెండెంట్లు) పర్యవేక్షించి నిర్ధారించాలని ఆయన అన్నారు. విద్యార్థులు , పిల్లల భద్రత అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం కాబట్టి, పాఠశాలల సమీపంలోని దుకాణాలపై నిశిత నిఘా ఉంచాలని, అవసరమైతే తనిఖీలు చేసి మాదకద్రవ్యాల విక్రయాలను అరికట్టాలని అన్నారు విజయ్.
