సమాచార నెట్వర్క్ లో ఆదర్శ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్
తీర్చిదిద్దుతామని ప్రకటించిన సీఎం చంద్రబాబు
అమరావతి : సమాచార నెట్వర్క్ అంశంలో ఆంధ్రప్రదేశ్ ను ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనికేషన్ నెట్వర్క్ ను ఏర్పాటు చేయటం ద్వారా సమాచార వ్యవస్థలో లాస్ట్ మైల్ కనెక్టివిటీ దిశగా పని చేస్తున్నామని సీఎం వెల్లడించారు. కమ్యూనికేషన్ నెట్ వర్క్ ను మరింత బలోపేతం చేసేలా కృషి చేయాలని సూచించారు. క్యాంపు కార్యాలయంలో రాష్ట్రంలో కమ్యూనికేషన్ నెట్వర్క్ పై సీఎం వివిధ సర్వీసు ప్రొవైడర్లు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. మొబైల్ కవరేజి విషయంలో సర్వీసు ప్రొవైడర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీఎం చెప్పారు. మారుమూల ప్రాంతాల్లో సెల్ టవర్లు, కమ్యూనికేషన్ నెట్వర్క్ ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఏపీ వ్యాప్తంగా కమ్యూనికేషన్ వ్యవస్థను మరింత బలోపేతం చేసేలా మరిన్ని సెల్ టవర్లను ఏర్పాటు చేయాలని వివిధ కంపెనీల ప్రతినిధులకు సూచనలు జారీ చేశారు సీఎం. ప్రస్తుతం రాష్ట్రంలో 30,694 సెల్ టవర్లు ఉన్నాయని, మరో 2310 సెల్ టవర్లను ఏర్పాటు చేయాల్సి ఉందని ఐటీ, కమ్యూనికేషన్ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ సీఎంకు వివరించారు. దీనిపై స్పందించిన సీఎం అవసరమైన మేరకు సర్వీసు ప్రొవైడర్లకు ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తామని తెలిపారు. వంద రోజుల్లో సెల్ టవర్లను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. భౌగోళికంగా కవరేజి లేని ప్రాంతాల వివరాలను ఇస్తామని స్పష్టం చేశారు. రాజధాని అమరావతిలో ఫైబర్ ద్వారా సమాచార నెట్వర్క్ ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఎక్కడా తవ్వకాలు జరక్కుండా ప్రతీ ఇంటికీ ఫైబర్ నెట్వర్క్ అందిస్తామన్నారు. ఏపీ వ్యాప్తంగా 1,69,638 కిలోమీటర్ల ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ తో పాటు 28.67 లక్షల బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్లు ఉన్నాయని అధికారులు తెలిపారు.
