హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర విశాల ప్రయోజనాలే లక్ష్యంగా పని చేయాలని ఎంపీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా ఈ విషయంలో కలిసి ముందుకు సాగుదామని ఆయన పిలుపునిచ్చారు. నీటి పారుదల ప్రాజెక్టులు, మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతుల సాధనపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం కోరారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో కేంద్రంలో పెండింగ్‌లో ఉన్న అంశాలపై ఎంపీలకు మహాత్మాజ్యోతిబా పూలే ప్రజా భవన్లో పవర్ పాయింట్ ప్రజంటేషన్ను ఏర్పాటు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దేశ జనాభాలో 10 శాతం జనాభా ఆరు మహా నగరాల్లో ఉందని, అయితే ఈ నగరాలు 25 శాతం జీడీపీ కలిగి ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటుకు కేంద్ర ఆర్థిక శాఖ అనుమతి అవసరమని తెలిపారు. ఎంపీలు ఈ విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి ఐఐఎం మంజూరుకు విజ్ఞప్తి చేయాలని సీఎం సూచించారు.
హైదరాబాద్ మెట్రో ఫేజ్-I స్వాధీనం, మెట్రో ఫేజ్-II విస్తరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో చర్చల సరళిని సీఎం ఎంపీలకు వివరించారు. ఇందుకు సంబంధించి SBICAPSని కన్సల్టెంట్‌గా నియమించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని, ఆ ప్రక్రియ త్వరగా ముందుకు సాగేలా చూడాలని ఎంపీలకు సీఎం సూచించారు. ఈ విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డిలకు సీఎం విజ్ఞప్తి చేశారు. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంలో 95 శాతం భూ సేకరణ పూర్తయిందని.. ఆ పనుల ప్రారంభానికి, దక్షిణ భాగం ఆర్ఆర్ఆర్ భూ సేకరణకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపాల్సి ఉందని సీఎం తెలిపారు. ఈ విషయంలో ఎంపీలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం సూచించారు.
మూసీ పునరుజ్జీవనం పనుల్లో మొదటి దశ టెండర్ల దశకు వచ్చిందని సీఎం తెలిపారు. ఈ పనులను అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద తీసుకునే విషయంలో కేంద్ర అప్రూవల్ లెటర్ ఇవ్వాల్సి ఉందన్నారు. ఎంపీలు ఈ విషయంలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కలిసి విజ్ఞప్తి చేయాలని సూచించారు. అంతరాష్ట్ర నదీ జలాల విషయమై ఇటీవల కర్ణాటకలో జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో ఏపీ, కర్ణాటక ముఖ్యమంత్రులతో చర్చించిన అంశాలను సీఎం ఎంపీలకు వివరించారు. తుంగభద్ర నుంచి తెలంగాణకు 15.09 టీఎంసీల నీరు రావల్సి ఉన్నా పూడికతో 5 టీఎంసీలకు మించి రావడం లేదన్నారు. డ్యామ్‌తో పాటు కాలువల్లో పూడిక తొలగింపునకు ఏపీ, కర్ణాటక సహకరించేలా ఒప్పించాలని సీఆర్ పాటిల్‌ను కోరామని, ఈ విషయంపైనా ఎంపీలు కేంద్ర మంత్రిని కలవాలని సీఎం సూచించారు.
నదుల అనుసంధానంలో గోదావరి నుంచి నాగార్జున సాగర్‌కు నీళ్లు తీసుకునే విషయంలో ఛత్తీస్‌గఢ్‌ను ఒప్పించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుందని సీఎం తెలిపారు. గోదావరిలో ఛత్తీస్‌గఢ్‌కు 300 టీఎంసీల వాటా ఉందని, వాటిని ఛత్తీస్‌గఢ్ వాడుకోవడం లేదన్నారు. భవిష్యత్‌లో 160 టీఎంసీలు వాడుకున్నా 143 టీఎంసీలు మిగులు ఉంటాయన్నారు. అందులో తెలంగాణకు 43 టీఎంసీలు లభించే అవకాశం ఉందన్నారు. గోదావరి నుంచి ఏపీ ప్రాంతం మీదుగా తమిళనాడు, కర్ణాటక, కేరళకు నీరు తీసుకెళ్లే గోదావరి-కావేరి అనుసంధానం ఉందన్నారు. ఈ విషయంలో ఎంపీలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం సూచించారు. ఇక్కడ నీళ్లు ఛత్తీస్‌గఢ్ వి అయితే నిధులు కేంద్రానివని… ఆ రెండింటిని తెలంగాణకు అనుకూలంగా సాధించాలని సీఎం అన్నారు.
