అమరావతి : బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల కోసం కూటమి ప్రభుత్వం వేల కోట్ల ఖర్చు చేస్తోందని మంత్రులు సవిత, బాలవీరాంజనేయ స్వామి వెల్లడించారు. త్వరలో అర్హులకు కొత్త పెన్షన్లు, ఇళ్ల స్థలాలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఇకపై హాస్టళ్లకు బదులు గురుకులాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా తమ ప్రభుత్వం పాలన సాగిస్తోందని తెలిపారు. కొండేపి నియోజక వర్గంలోని సింగరాయకొండలో మంత్రులు పర్యటించారు. అక్కడ రూ.65 లక్షలతో నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభించారు. అనంతరం టంగుటూరు ఎంజేపీ గురుకుల బాలిక పాఠశాలకు శాశ్వత భవన నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రులు సవిత, బాలవీరాంజనేయ స్వామి మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పాలన సాగిస్తోందన్నారు. అభివృద్ధిని, సంక్షేమాన్ని జోడు గుర్రాల్లా పరుగులు తీయిస్తోందన్నారు.
వీబీ రామ్ జీ పథకం ద్వారా వేల కోట్లతో రోడ్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు మంత్రులు. సింగరాయ కొండ ఎస్టీ కాలనీలో రూ.65 లక్షలతో నిర్మించిన బీటీ రోడ్డే దీనికి నిదర్శనమన్నారు . రాష్ట్రంలో బీసీ బిడ్డల విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. రూ.500 కోట్ల సాస్కి నిధులతో ఎంజేపీ గురుకుల పాఠశాలలకు శాశ్వత భవనాలు నిర్మిస్తున్నామన్నారు. దీనిలో భాగంగా టంగుటూరు ఎంజేపీ గురుకుల పాఠశాలకు శాశ్వత భవనాన్ని సమకూర్చనున్నట్లు తెలిపారు. ఇప్పటికే స్థలం సమకూర్చామని, రూ.45 కోట్లతో త్వరలో పనులు ప్రారంభించనున్నామని తెలిపారు. మొదటి విడతగా రూ.20 కోట్లు మంజూరు చేశామన్నారు. రాష్ట్రంలో ఆరు ఎంజేపీ గురుకులాలను జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో హాస్టళ్లకు బదులు గురుకులాలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. గురుకులాల ఏర్పాటుతో నాణ్యమైన విద్యతో పాటు ఆహార భద్రతతో కూడిన రక్షణ విద్యార్థులకు లభిస్తుందన్నారు. రెండేళ్ల కూటమి పాలనలో గతంలో ఎన్నడూ జరగనంత అభివృద్ధి చేపట్టామన్నారు.
