టీటీడీ ట్రస్టులు, పథకాల దాతల ప్రివిలేజెస్‌లో మార్పులు
రూ.17.84 కోట్లతో ఒంటిమిట్టలో 100 గదుల నిర్మాణం
తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి (టీటీడీ) లోని వివిధ ట్రస్టులు , స్కీమ్‌లకు విరాళాలు అందించే దాతలకు కల్పిస్తున్న ప్రివిలేజెస్‌లో పలు మార్పులు చేస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ బోర్డు సమావేశం జరిగింది. అనంతరం టీటీడీ ఛైర్మన్, ఈవో ముద్దాడ రవిచంద్రతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ మాట్లాడుతూ విరాళాల నిర్వహణలో మరింత పారదర్శకత, ఏకరీతి (యూనిఫార్మిటీ) తీసుకు రావడానికి టీటీడీకి చెందిన అన్ని ట్రస్టులు, పథకాలకు విరాళాలు అందించే దాతలకు కల్పించే ప్రివిలేజెస్‌లో పలు మార్పులు చేపట్టామన్నారు. ఈ కొత్త నిబంధనలు ఈ రోజు అర్ధరాత్రి నుంచి అమలులోకి వస్తాయని తెలిపారు. అయితే, ఇప్పటికే వివిధ ట్రస్టులు, పథకాలకు విరాళాలు అందించిన దాతలకు ప్రస్తుతం అమలులో ఉన్న ప్రివిలేజెస్ యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.
రూ.6.31 కోట్లతో తిరుమలలో SSD టోకెన్లు కలిగిన భక్తులు వేచి ఉండేందుకు ఆళ్వార్ ట్యాంక్ సమీపంలో శాశ్వత షెల్టర్లు, క్యూలైన్లు, మరుగుదొడ్లు నిర్మించేందుకు టెండర్లు ఆమోదం తెలపడం జరిగిందన్నారు. తిరుమలలోని కుమారధార, పసుపుధార డ్యామ్‌లు మరింత పటిష్టంగా ఉండేందుకు డబుల్ లేన్ వంతెన నిర్మాణానికి రూ.2.77 కోట్లు మంజూరు చేసేందుకు ఓకే చెప్పినట్లు తెలిపారు. తిరుమలలో గ్రీన్ ఎనర్జీ అభివృద్ధి చేయడంలో భాగంగా GNC సమీపంలో 800 కిలోవాట్ల విండ్ టర్బైన్ జనరేటర్‌ను విష్ విండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వారిచే విరాళంగా ఏర్పాటు చేసి, టీటీడీకి 25 సంవత్సరాల పాటు నిరంతరాయంగా విద్యుత్ అందించేందుకు ఆమోదం తెలిపిందన్నారు.
