అమరావతి : చేనేత రంగంలో దేశంలో ఏపీని నెంబర్ వన్ గా నిలపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. నాలుగు రోజుల పాటు సాగిన భారత్ టెక్స్ 2026లో మూడు ఒప్పందాలు చేసుకున్నామని తెలిపారు. ఢిల్లీలో జరుగుతున్న భారత్ టెక్స్ 2026లో చివరి రోజైన శుక్రవారం మంత్రి సవిత బిజీగా గడిపారు. ఏపీ చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పనే లక్ష్యంగా పలువురు పెట్టుబడిదారులు, కొనుగోలుదారులతో భేటీ అయ్యారు. హవాక్ గ్రూప్ ఆఫ్ ఎండీ ప్రవీణ్ సంగ్వాన్ తదితర పెట్టుబడిదారులతో మంత్రి సవిత ఏపీలో టెక్స్ టైల్స్ రంగంలో పెట్టుబడుల గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఏపీలో చేనేత, జౌళి రంగ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నూతన టెక్స్ టైల్స్ పాలసీ తీసుకొచ్చామన్నారు. మెగా, మినీ క్లస్టర్లు, టెక్స్ టైల్స్ పార్కులు ఏర్పాటు చేస్తున్నామన్నారు సవిత.
ప్రతి నియోజక వర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని, వాటిలో నేతన్నలకు అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. ఏపీలో చేనేత రంగంలో పెట్టుబడులు పెట్టే వారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు సవిత. చేనేత రంగంలో ఏపీని నెంబర్ వన్ గా నిలబెట్టడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. భారత్ టెక్స్ 2026లో ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్ లో స్టాళ్లను పరిశీలించారు. ఈ నెల 14వ తేదీ నుంచి ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న భారత్ టెక్స్ 2026లో ఏపీ చేనేత, జౌళి శాఖాధికారులు మూడు సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. రాష్ట్రంలో ఆధునిక టెక్స్‌టైల్ రీసైక్లింగ్ ఎకోసిస్టమ్ ఏర్పాటు చేయడానికి తిరువూరుకు చెందిన బీకేఎస్ ఫ్యాబ్రిక్స్ తో అవగాహన ఒప్పందం జరిగింది. ఈ సంస్థ రాష్ట్రంలో రూ.4 వేల కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. పది ఎకరాల్లో టెక్స్‌టైల్ రీసైక్లింగ్ యూనిట్ ఏర్పాటు చేయనున్నారు. వినియోగానంతర వస్త్ర వ్యర్థాలను శాస్త్రీయంగా సేకరించి, వర్గీకరించి, పునర్వినియోగానికి అనువుగా ఈ యూనిట్ మార్చనుంది.
