న్యూఢిల్లీ : నీతి ఆయాగ్ కీలక ప్రకటన చేసింది. దేశంలోని ఆయా రాష్ట్రాలకు సంబంధించి పెట్టుబడుల ఇండెక్స్ ను ప్రకటించింది . తాజాగా విడుదల చేసిన నీతి ఆయోగ్ ‘పెట్టుబడులకు అనుకూలత సూచీ’ 2026లో తెలంగాణ 10వ స్థానంలో నిలిచింది. బలమైన వ్యాపార వాతావరణం, సంస్థాగత పనితీరుతో రాష్ట్రం ‘ముందంజలో ఉన్న రాష్ట్రాల’ జాబితాలో చేరింది. పెద్ద రాష్ట్రాల విభాగంలో 47.3 స్కోరుతో తెలంగాణ ‘ఎగువ-మధ్య స్థాయి’ లో స్థానం పొందింది. జాతీయ స్థాయిలో గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు మొదటి మూడు స్థానాలను దక్కించుకున్నాయి. ఈ సూచీ తెలంగాణను ‘ముందంజలో ఉన్న రాష్ట్రం’గా వర్గీకరించింది. అంటే రాష్ట్రం మొత్తం మీద మంచి పనితీరు కనబరిచినప్పటికీ, అత్యుత్తమ పనితీరు కనబరిచే రాష్ట్రాల సరసన చేరడానికి ఇంకా మెరుగుదల అవసరమని ఇది సూచిస్తోంది.
పెట్టుబడిదారుల దృక్పథం, పాలనా పరమైన చర్యలు, వ్యాపార సులభతరీకరణ వంటి అంశాల కారణంగా, సంస్థాగత వాతావరణం, వ్యాపార వాతావరణ సూచీలలో రాష్ట్రం మంచి స్కోరు సాధించింది. అయితే, మౌలిక సదుపాయాలు (ముఖ్యంగా లాజిస్టిక్స్ , అనుసంధానత) అలాగే వనరులు/అధునాతన నైపుణ్యాల విషయంలో మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని గుర్తించారు. ఐఎఫ్ఐ రాష్ట్రాలు పెట్టుబడులను ఎంత సమర్థవంతంగా ఆకర్షిస్తున్నాయో , నిలబెట్టుకుంటున్నాయో అంచనా వేస్తుంది. ఇది మౌలిక సదుపాయాలు, వ్యాపార వాతావరణం, వనరులు, ప్రభుత్వ విధానం, నియంత్రణల సరళత, ఆర్థిక ఆరోగ్యం, సంస్థాగత వాతావరణం , పర్యావరణ స్థితిస్థాపకత అనే ఎనిమిది అంశాల ఆధారంగా, 84 సూచీలను ఉపయోగించి రాష్ట్రాలను మూల్యాంకనం చేస్తుంది.
గుజరాత్ 56.6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా, ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర (53.7) , తమిళనాడు (53.3) ఉన్నాయి. గోవా , ఒడిశా మొదటి ఐదు స్థానాలను పూర్తి చేశాయి. బలమైన మౌలిక సదుపాయాలు, ఆర్థిక ఆరోగ్యం, నియంత్రణల సరళత, విధాన పరమైన చర్యలు గుజరాత్ అగ్రస్థానంలో నిలవడానికి కారణమయ్యాయి. మహారాష్ట్ర ర్యాంకింగ్‌కు దాని వ్యాపార వాతావరణం, భారీ ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడుల రాక దోహదపడగా, తమిళనాడు ఓడరేవు సామర్థ్యం, ఎగుమతుల పనితీరు , దాదాపు 100 శాతం అవగాహన ఒప్పందాల (MoU) అమలులో ప్రత్యేకత చాటుకుంది.
