హార్టీకల్చర్ హబ్‌గా రాయ‌ల‌సీమ : సీఎం

కేంద్ర ప్ర‌భుత్వం స‌హ‌కారం అందించాల‌ని కోరిన చంద్ర‌బాబు

అమ‌రావ‌తి : రాయలసీమ ఇంటిగ్రేటెడ్ హార్టీకల్చర్ డెవలప్మెంట్ ప్లాన్ కు కేంద్రం నుంచి పూర్తి సహకారం అవసరమని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు సీఎం చంద్ర‌బాబు నాయుడు స్పష్టం చేశారు. కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, సత్యసాయి, నంద్యాల, అన్నమయ్య, తిరుపతి సహా ప్రకాశం, మార్కాపురం జిల్లాలు ఉద్యాన ఉత్పత్తిలో 55 శాతం వాటాను కలిగి ఉన్నాయని సీఎం వివరించారు. 2030 నాటికి సాగు విస్తీర్ణాన్ని 14.41 లక్షల హెక్టార్లకు పెంచటంతో పాటు ఉద్యాన ఉత్పత్తులను 435 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచేలా చర్యలు చేపట్టామని తెలిపారు. 201 ఉద్యానవన క్లస్టర్ల ద్వారా రూ. 14,906 కోట్ల పెట్టుబడి ద్వారా 9 లక్షల మంది రైతులకు లబ్ది కలుగుతుందని సీఎం స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో నీటి భద్రత కోసం రూ.20,884 కోట్ల వ్యయంతో 23 సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాల్సి ఉందని. తద్వారా 9 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు, 4.3 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందన్నారు.

రూ. 4,562 కోట్ల వ్యయంతో 5,721 కిలోమీటర్ల గ్రామీణ రోడ్ల ఆధునీకరణ చేపట్టి వివిధ ప్రాంతాలను అనుసంధానించాల్సి ఉందని ముఖ్యమంత్రి వివరించారు. గ్రామీణ ప్రాంతాల కనెక్టివిటీ ద్వారా రైతులకు మార్కెట్ సౌకర్యంతో పాటు రవాణా ఖర్చులు తగ్గుతాయని అన్నారు. ప్రభుత్వం నుంచి రూ.40 వేల కోట్లు, ప్రైవేటు రంగం ద్వారా రూ.60 వేల కోట్ల మేర పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నామని వివరించారు. ఈ పెట్టుబడితో ఏటా రూ.81 వేల కోట్ల జీవీఏ సాధించే అవకాశం ఉంటుందని .. 19.7 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు సీఎం. వ్యవసాయంలో ఆధునిక పరికరాల ద్వారా దిగుబడిలో 10 శాతం వృద్ధి సాధించటంతో పాటు కోత అనంతర నష్టాలను 45 లక్షల మెట్రిక్ టన్నులకు తగ్గించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. వికసిత్ భారత్ , స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలను చేరుకోవాలన్నదే ఈ ప్రణాళిక లక్ష్యమని సీఎం వివరించారు. ఆగస్టు 6-7 తేదీల్లో హార్టీకల్చర్ హబ్ పనులు ప్రారంభించనున్నామని ఈ కార్యక్రమానికి హాజరు కావాలని సీఎం కేంద్ర మంత్రిని ఆహ్వానించారు.

Leave A Reply

Your Email Id will not be published!