అమరావతి : ఏళ్ల తరబడి పదోన్నతుల కోసం పరితపిస్తున్న బీసీ హాస్టళ్లకు చెందిన 300 మందికిపైగా గ్రేడ్ 2 వార్డెన్లకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సర్వీస్ రూల్స్ రూపొందిస్తూ… పదోన్నతులకు అవకాశం క ల్పించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. దీనిపై గ్రేడ్ 2 వార్డెన్లు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబుకు, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవితకు ధన్యవాదాలు తెలిపారు. బీసీ హాస్టళ్లకు చెందిన 300 మందికిపైగా గ్రేడ్ 2 హాస్టల్ వార్డెన్లు ఏపీపీఎస్సీ ద్వారా నియాకమయ్యారు. సర్వీసు రూల్స్ లేక పోవడంతో, గ్రేడ్ 1 వార్డెన్ గా పదోన్నతి పొందే అవకాశం లేకుండా పోయింది. ఇదే విషయమై 2008 నుంచి సర్వీస్ రూల్స్ రూపొందించాలని, పదోన్నతులు కల్పించాలని ఎన్నో పర్యాయాలు ఆయా ప్రభుత్వాల దృష్టికి తీసుకొస్తున్నారు. ఏళ్లు గడుస్తున్నా, ప్రభుత్వాలు మారుతున్నా తమ పదోన్నతుల కల మాత్రం తీరలేదు. ప్రమోషన్లు లేకుండానే పదవీ విరమణ చేస్తామనే ఆందోళన వారిని వెంటాడుతుండేది.
ఇదే విషయమై సీఎం చంద్రబాబు దృష్టికి మంత్రి సవిత తీసుకెళ్లారు. ప్రమోషన్ల కోసం గ్రేడ్ 2 వార్డెన్లు ఎంతలా ఎదురు చూస్తున్నారో వివరించారు, ఈ నేపథ్యంలో గ్రేడ్ 2 హాస్టల్ వార్డెన్లకు పదోన్నతుల కల్పించాలని సీఎం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా సర్వీస్ రూల్స్ రూపొందిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీనివల్ల భవిష్యత్తులో గ్రేడ్ 1 వార్డెన్లగా వారికి పదోన్నతులు కల్పించడానికి అవకాశం కలుగుతుంది. ఉద్యోగంలో చేరిన నాటి నుంచి సీనియార్టీని పరిగణలోకి తీసుకుని పదోన్నతులు కల్పించనున్నారు. సర్వీస్ రూల్స్ రూపకల్పనతో పదోన్నతుల కల్పనలో తమకు అవకాశముంటుందని గ్రేడ్ 2 వార్డెన్లు ఉబ్పితబ్బిబ్బవుతున్నారు. 18 ఏళ్ల నుంచి పదోన్నతులు లేకుండా గ్రేడ్ 2 హాస్టల్ వార్డెన్ గానే నిలిచి పోయిన 300 మందికి పైగా ఉద్యోగులకు ఎంతో ఉపశమనం కలిగించనుంది.
