‘మిషన్ ఆగమన్’ ప్ర‌యోగం విజ‌య‌వంతం

కుమారుడు దేవాన్ష్ తో కలిసి వీక్షించిన మంత్రి నారా లోకేష్‌

శ్రీహరికోట: ‘మిషన్ ఆగమన్’ ద్వారా భారత అంతరిక్ష రంగంలో మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ప్రైవేటు సంస్థ అయిన ప్రముఖ స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన భారతదేశపు తొలి ప్రైవేట్ ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ ‘విక్రమ్-1’ను శనివారం ఉదయం 11.30 గం.లకు తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలోని(షార్) ఒకటో ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి పంపారు. మిషన్ ఆగమన్ పేరిట చేపట్టిన తొలి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్ ప్రయోగ కార్యక్రమాన్ని షార్ లోని ఇస్రో లాంచ్ వ్యూ గ్యాలరీ నుంచి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్ తో కలిసి వీక్షించారు.

దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్ గా ఆర్బిటాల్ విక్రమ్-1ను అభివృద్ధి చేశారు. స్కైరూట్ అభివృద్ధి చేసిన ప్రొపల్షన్ సిస్టమ్స్, త్రీడీ ప్రింటెడ్ ఇంజన్లు, ఘన ఇంధన రాకెట్ బూస్టర్లు అమర్చారు. సుమారు 350 కిలోల బరువున్న నాలుగు చిన్న ఉపగ్రహాలను 450 కి.మీల ఎత్తులోని భూ నిమ్న కక్ష్యలోకి ప్రవేశపెట్టేలా విక్రమ్-1ను డిజైన్ చేశారు. విక్రమ్-1 ద్వారా గ్రహాస్పేస్, కాస్మోసర్వ్, డీక్యూబ్డ్ సంస్థలకు చెందిన టెక్నాలజీ డెమాన్ స్ట్రేషన్ పేలోడ్లతో పాటు స్కైరూట్ కు చెందిన ‘స్కోప్’ ఉపగ్రహాలను రోదసిలోకి తీసుకెళ్లారు. వీటితో పాటు కాస్మోస్ డైమండ్స్ కు చెందిన కాస్మిక్ బ్లూమ్ అనే కళాకృతిని, మరో మైక్రో-ఆర్ట్ పీస్ ను పంపారు. అంతరిక్ష ప్రయోగాల్లో ఖర్చును తగ్గించడంతో పాటు ఉపగ్రహాలను వేగంగా కక్ష్యలోకి చేర్చేందుకు వీలుగా విక్రమ్-1 రాకెట్ ను రూపొందించారు.

ఈ కార్యక్రమంలో స్కైరూట్ ఏరోస్పేస్ కో-ఫౌండర్, సీఈవో పవన్ కుమార్ చందన, ఇస్రో ఛైర్మన్ డాక్టర్ కే.నారాయణ పాల్గొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!