విశాఖపట్నం జిల్లా : ఈ నెల 28, 29 తేదీల్లో జరగనున్న సింహాచలం గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశం అనంతరం వీసీ హాలులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలను వెల్లడించారు. 32 కిలోమీటర్ల మేర సింహగిరి చుట్టూ జరిగే గిరి ప్రదక్షిణలో 5 నుంచి 6 లక్షల మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉందని, దానికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. వివిధ శాఖలకు చెందిన సుమారు 5 వేల మంది ఉద్యోగులు భక్తుల సేవలో నిమగ్నమవుతారని చెప్పారు. ఈ నెల 28న ఉదయం నుంచే భక్తులు తొలిపావంచా వద్ద కొబ్బరికాయలు కొట్టి గిరి ప్రదక్షిణ ప్రారంభించనున్నారని, మధ్యాహ్నం 2 గంటలకు తొలిపావంచా నుంచి శ్రీ స్వామివారి రథం బయలు దేరుతుందన్నారు. రద్దీ నియంత్రణకు తొలిపావంచా వద్ద 50 క్యూ లైన్లు, 120 ఇనుప స్టాండ్లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.
భక్తుల సౌకర్యార్థం గిరి ప్రదక్షిణ మార్గంలో 28 సహాయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి కేంద్రంలో పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్, లైటింగ్, సూచిక బోర్డులు, వైద్య సదుపాయాలు, కార్పెట్ తదితర ఏర్పాట్లు ఉంటాయన్నారు. తొలిపావంచా, అడవివరం జంక్షన్, హనుమంతవాక, అప్పుఘర్, మాధవధార, ఎన్‌ఎస్‌టీఎల్ గేట్, పాత గోశాల వద్ద మొత్తం ఏడు ప్రత్యేక కంట్రోల్ రూములు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పోలీస్, దేవస్థానం, వైద్య ఆరోగ్య, జీవీఎంసీ సిబ్బంది సమన్వయంతో సేవలు అందిస్తారని చెప్పారు. గిరి ప్రదక్షిణ మార్గంలో 31 వైద్య శిబిరాలు, 22 అంబులెన్సులను అందుబాటులో ఉంచుతున్నట్లు పేర్కొన్నారు. 28, 29 తేదీల్లో మొబైల్ వైద్య బృందాలు, మెట్ల మార్గంలో ప్రత్యేక వైద్య బృందాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. కొండపై కూడా అదనపు వైద్య సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
భక్తులకు తాగునీటి కొరత లేకుండా మార్గంలో, కొండపై నిరంతర నీటి సరఫరా కల్పిస్తున్నట్లు చెప్పారు. గిరి ప్రదక్షిణ మార్గంలో 115 వాటర్ పాయింట్లు, వాటర్ బబుల్స్, వాటర్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. భక్తులకు పంపిణీ చేసే మజ్జిగ, పులిహోర, ఇతర ఆహార పదార్థాల ప్యాకెట్లను ఎప్పటికప్పుడు తొలగించేందుకు ప్రత్యేక పారిశుద్ధ్య సిబ్బందిని నియమిస్తున్నట్లు చెప్పారు. మార్గంలో మొత్తం 595 తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తున్నట్లు, దేవస్థానం, జీవీఎంసీ ఆధ్వర్యంలోని శాశ్వత మరుగుదొడ్లను కూడా అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు.
