అమరావతి : ఏపీ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎల్ నినో నేపథ్యంలో నీటిని పొదుపుగా వాడుకోవాలని రైతులకు సూచించారు. కాకినాడ జిల్లాలో ఎల్ నినోను ఎదుర్కోవడానికి నీటిపారుదల శాఖ సన్నద్ధతను సమీక్షించేందుకు చేపట్టిన రెండు రోజుల పర్యటనలో భాగంగా నిమ్మల రామానాయుడు సామర్లకోట వద్ద పిఠాపురం బ్రాంచ్ కెనాల్ , ఏలేరు రిజర్వాయర్ కెనాల్ రెగ్యులేటర్ వద్ద నీటి మట్టాలను పరిశీలించారు. అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించు కోవాలని, శాస్త్రీయ నీటి నిర్వహణ పద్ధతులను పాటించాలని రైతులకు పిలుపునిచ్చారు. పిఠాపురం బ్రాంచ్ కెనాల్ (పీబీసీ)లో నీటి మట్టం 7.2 అడుగులు ఉందని, కాలువ ద్వారా 486 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని అధికారులు మంత్రికి వివరించారు. సామర్లకోట సమీపంలోని 2/0 రెగ్యులేటర్ వద్ద ఏలేరు కాలువ ఆధునీకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని తెలిపారు.
కాలువ చివరి ఆయకట్టు ప్రాంతాలకు నీరు చేరేలా పిబిసి లో పూడికతీత పనులను వెంటనే చేపట్టాలని రామానాయుడు అధికారులను ఆదేశించారు. రైతులకు నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా నీటిపారుదల , రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆయన సూచించారు. గోదావరి డెల్టాలోని ఎత్తైన ప్రాంతాల (అప్‌ల్యాండ్) రైతులు తక్కువ నీటితో పండే పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ సూచనలను అనుసరించాలని, అలాగే నీటిపారుదలకి సంబంధించి రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని పేర్కొన్నారు. మంత్రి వెంట ఇంజినీర్ ఇన్ చీఫ్ నరసింహమూర్తి, ఇరిగేషన్ బోర్డు సలహాదారు ఎం. వెంకటేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, ఏలేరు ప్రాజెక్టు వైస్ చైర్మన్ కోట నానిబాబు, చీఫ్ ఇంజినీర్ చిన్నారావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామకృష్ణ, జి. శేషగిరి ఉన్నారు.
