తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మ వారి ఆలయం , అనుబంధ ఆలయాలలో ఆగస్టు నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఉత్సవాల వివరాలను ఇవాళ వెల్లడించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది టీటీడీ. కోరిన కోర్కెలు తీర్చే అమ్మ వారిని నిత్యం వేలాది మంది దర్శించుకుంటారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ప్రతి భక్త బాంధవులు తప్పనిసరిగా తిరుచానూరులో కొలువై ఉన్న శ్రీ పద్మావతి అమ్మ వారిని దర్శించు కోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇదిలా ఉండగా శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఆగష్ఠు 7, 14, 28వ తేదీలలో శుక్రవారం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు తిరుచ్చిపై అమ్మ వారు ఆలయ నాలుగు మాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. 25న ఉత్తరాషాడ నక్షత్రం సందర్భంగా శ్రీపద్మావతి అమ్మ వారు సాయంత్రం 6.45 గంటలకు గజ వాహనంపై భక్తులను కటాక్షిస్తారు. 21న వరలక్ష్మీ వ్రతం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు శ్రీపద్మావతి అమ్మవారి స్వర్ణరథోత్సవం జరుగుతుంది.
8న రోహిణి నక్షత్రం సందర్బంగా శ్రీ కృష్ణ స్వామివారికి సాయంత్రం 6 గంటలకు తిరుచ్చి ఉత్సవం జరుగనుంది. శ్రీ సుందరరాజ స్వామి ఆలయంలో ఆగష్ఠు 3, 30వ తేదీలల్లో న ఉత్తర భద్ర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు స్వామి వారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధులలో విహరించి అనుగ్రహించనున్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఆగష్ఠు 17న హస్త నక్షత్రం సందర్భంగా సాయంత్రం 5 గంటలకు స్వామివారు తిరుచ్చిపై భక్తులను కటాక్షించనున్నారు.
తిరుచానూరు శ్రీనివాస ఆలయంలో ఆగష్ఠు 1, 8, 15, 22, 29వ తేదీలలో వేంకటేశ్వర స్వామివారి మూలవర్లకు అభిషేకం జరుగుతుంది . అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆగష్ఠు 4న తేదీ ఉదయం 8 గంటలకు అష్టదళ పాద పద్మారాధన సేవ నిర్వహించనున్నట్లు తెలిపింది టీటీడీ. ఆగష్ఠు 7, 14, 21, 28వ తేదీలలో శుక్రవారం సందర్భంగా ఉదయం 7 గంటలకు వస్త్రలంకారణ సేవ, అభిషేకం జరుగుతుంది. ఆగష్ఠు 12న ఉదయం 8 గంటలకు అష్టోత్తరశత కలశాభిషేకం. 26న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి కల్యాణోత్సవం. ఆగష్ఠు 2, 9, 16, 23, 30వ తేదీలలో శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారికి ఉదయం 8.15 గంటలకు అభిషేకం జరుగుతుందని తెలిపింది.
