అభివృద్ధి కోసం 2 ఏళ్లల్లో రూ.1.34 లక్షల కోట్లు ఖర్చు చేశాం

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. గత పాలకుల నిర్వాకం వల్ల ఆర్థిక ఇబ్బందులున్నా గడచిన 2 ఏళ్లల్లో పేదలను ఆదుకునేందుకు రూ.1.50 లక్షల కోట్లు సంక్షేమం కోసం ఖ‌ర్చు చేశామ‌న్నారు. అభివృద్ధి కోసం 2 ఏళ్లల్లో రూ.1.34 లక్షల కోట్లు ఖర్చు చేశామ‌ని తెలిపారు.
ప్ర‌ధానంగా రోడ్లు సహా ఇతర మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాం అన్నారు. గత పాలనలో రాజధాని లేకుండా రాష్ట్రం పేరు చెబితే ఇతర ప్రాంతాల్లో చులకన అయ్యేలా చేశారన్నారు. అద్భుతమైన నగరం ఉండాలనే అమరావతిని నిర్మిస్తున్నాం అని చెప్పారు సీఎం. రాజధానిపై గత పాలకులు నాలుక మడతపెట్టారు. మూడు ముక్కల ఆట ఆడారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేశార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు నారా చంద్ర‌బాబు నాయుడు. అందుకే కూటమి అధికారంలోకి వచ్చాక అమరావతి పనులు రీస్టార్ట్ చేశామ‌ని తెలిపారు.

వేగంగా జరుగుతున్న పనులు చూసి రాజధానిపై మళ్లీ కుట్రలు పన్నుతున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ఇప్పుడు కొత్త రాగం అందుకున్నార‌ని ఎద్దేవా చేశారు. మావిగన్, వాటికన్ అంటూ ఏవోవో చెబుతున్నారంటూ ఫైర్ అయ్యారు. మళ్లీ మూడు ముక్కలాట కావాలా…? రాజధానిని విధ్వంసం చేసుకుంటామా..? అని ప్ర‌శ్నించారు చంద్ర‌బాబు నాయుడు. కుటుంబానికి ఇల్లు, రాష్ట్రానికి రాజధాని అవసరం అన్నారు. దేశంలో ఏ రాష్ట్రమైనా తమ రాజధాని నగరాలను ఘనంగా చెప్పుకుంటున్నాయి. కానీ జ‌గ‌న్ రెడ్డి హ‌యాంలో ఏపీకి రాజ‌ధాని అనేది లేకుండా పోయింద‌న్నారు. ఆగస్టు 13 తేదీన రాజధానిలోని ప్రధాన రాజమార్గం సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం అవుతుందని ప్ర‌క‌టించారు సీఎం.

Leave A Reply

Your Email Id will not be published!