ఆర్ఎస్ఎస్ కు రిజిస్ట్రేష‌న్ అవ‌స‌రం లేదు

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన బీఎల్ సంతోష్

బెంగ‌ళూరు : ఇన్నేళ్లుగా ఎలా రిజిస్ట్రేష‌న్ లేకుండా కార్య‌క‌లాపాలు ఆర్ఎస్ఎస్ చేస్తోందంటూ బాంబు పేల్చారు రాష్ట్ర హోం శాఖ మంత్రి ప్రియాంక్ ఖ‌ర్గే. ఆయ‌న చేసిన కామెంట్స్ దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపాయి. ప్ర‌ధానంగా బీజేపీ, విహెచ్ పీ, ఆర్ఎస్ఎస్, భ‌జ‌రంగ్ ద‌ళ్, ఏబీవీపీ , త‌దిత‌ర హిందూవాద సంస్థ‌ల‌ను ఒక్క‌సారి ఉలిక్కి ప‌డేలా చేశాయి. ఈ దేశంలో ప్ర‌తి ఒక్క‌రు లేదా సంస్థ అయినా స్వంతంగా వ్యాపారం చేప‌ట్టాల‌న్నా త‌ప్ప‌నిస‌రిగా రిజిస్ట్రేష‌న్ అనేది ఉంటుంద‌న్నారు. మ‌రి ల‌క్ష‌లాది మంది స‌భ్యులు క‌లిగిన , లావాదేవీలు నిర్వ‌హిస్తున్న ఆర్ఎస్ఎస్ కు ఎందుకు రిజిస్ట్రేష‌న్ లేదో చెప్పాల‌ని స్ప‌ష్టం చేశారు ఖ‌ర్గే. దీనిపై స్పందించారు బీజేపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బీఎల్ సంతోష్. బెంగళూరులో ‘అఖండ భారత్ సంకల్ప దినం’ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. దేశ విభజన సమయంలో ఆర్ఎస్ఎస్ హిందువులకు అండగా నిలిచిందని సంతోష్ పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ ఉనికిని చాటుకోవడానికి రిజిస్ట్రేషన్ అవసరం లేదని, లక్షలాది మంది ప్రజల నమ్మకంతోనే ఆ సంస్థ పనిచేస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి చెప్పారు.

ఆర్ఎస్ఎస్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్న కర్ణాటక హోం మంత్రి ప్రియాంక్ ఖర్గే డిమాండ్‌పై ఆయన స్పందించారు. అప్పట్లో కూడా రిజిస్టర్ కాలేదు, ఇప్పటికీ రిజిస్టర్ కాలేదు. రిజిస్ట్రేషన్ దాని ఉనికిని నిర్ణయించదు; ఇది లక్షలాది మంది ప్రజల విశ్వాసంతో పనిచేస్తున్న సంస్థ అని బీఎల్ సంతోష్ అన్నారు. కేవలం ఉప్పు సత్యాగ్రహం లేదా రాట్నం తిప్పడం ద్వారా మాత్రమే కాకుండా, వేలాది మంది విప్లవకారులు , స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని సంతోష్ పేర్కొన్నారు. లక్షలాది మంది దేశభక్తి గల యువతీ యువకులు, సైనికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడటం వల్లే మనకు స్వాతంత్రం లభించింది అని ఆయన అన్నారు. మదన్ లాల్ ధింగ్రా, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, సుఖ్‌దేవ్ , రాజ్‌గురు వంటి విప్లవకారులను ప్రస్తావించారు.

ఒక ప్రాంతంలో హిందూ జనాభా తగ్గడం వల్ల భారతదేశంతో వారికి ఉన్న అనుబంధ భావన బలహీన పడుతుంది అని ఆయన పేర్కొన్నారు. హిందూ జనాభా ఎక్కడైతే తగ్గుతుందో, అక్కడ దేశ వ్యతిరేక భావనలు మొదలవుతాయి అని ఆరోపించారు. బెంగళూరులోని శివాజీనగర్ , చామరాజపేట నియోజకవర్గాల గురించి ప్రస్తావించారు. గ‌త‌ రెండు దశాబ్దాలుగా అక్కడ ఏ రాజకీయ పార్టీ నుంచీ హిందూ అభ్యర్థి గెలవలేదని సంతోష్ పేర్కొన్నారు; రాబోయే ఎన్నికల్లో అటువంటి అభ్యర్థులను బరిలోకి దింపాలని రాజకీయ పార్టీలకు సవాలు విసిరారు. జనాభా కూర్పులో వచ్చిన మార్పులే పాకిస్థాన్ ఏర్పాటు డిమాండ్‌కు కారణమని ఆయన అభిప్రాయపడ్డారు, అలాగే ముస్లిం లీగ్ చేపట్టిన రాజకీయ సమీకరణ చర్యలే చివరికి దేశ విభజనకు దారితీశాయని ఆరోపించారు. ‘నేడు భారతదేశం బలపడుతోంది. ఈ దేశం పట్ల దురభిప్రాయం ఉన్నవారు, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే, అభద్రతా భావానికి లోనవుతున్నారు అని సంతోష్ చెప్పారు.

Leave A Reply

Your Email Id will not be published!