కర్ణాటక : సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, సీడబ్ల్యూఆర్సీ సూచనతో కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ దిగి వచ్చింది. ఈ మేరకు తమిళనాడు రాష్ట్రానికి కృష్ణసాగర్ నుండి నీటిని విడుదల చేసింది. ఇదిలా ఉండగా దీనిని అడ్డుకుని తీరుతామని వార్నింగ్ ఇచ్చింది కర్ణాటక బీజేపీ. ఇదిలా ఉండగా కన్నడ ఉద్యమకారుడు వటల్ నాగరాజ్ ఈ చర్యను ఖండించారు . తన సంస్థ కన్నడ చలవళి వటల్ పక్ష ఆధ్వర్యంలో రాబోయే రెండు రోజుల్లో కృష్ణరాజ సాగర్ ఆనకట్టను ముట్టడిస్తామని ప్రకటించారు. నిన్న అర్ధరాత్రి సమయంలో కృష్ణరాజ సాగర్ జలాశయం నుండి తమిళనాడుకు నీటిని విడుదల చేశారని బీజేపీ , కన్నడ సంఘాలు ఆరోపించాయి. కావేరి నదీ జలాల నిర్వహణ అథారిటీ ఆదేశాల మేరకు 15 రోజుల పాటు రోజుకు 12,000 క్యూసెక్కుల నీటిని తమిళనాడుకు విడుదల చేయాలని కర్ణాటకకు సూచించిన నేపథ్యంలో ఈ విడుదల జరిగింది అని బీజేపీ మండ్య విభాగం ప్రతినిధి మంజునాథ్ తెలిపారు.
కృష్ణరాజ సాగర్ ఆనకట్ట మండ్య జిల్లాలో ఉంది. అర్ధరాత్రి సమయంలో కేఆర్ఎస్ నుండి నీటిని విడుదల చేశారు. నీటి విడుదల తర్వాత కావేరి నదిలో నీటి మట్టం పెరిగిందన్నారు. రైతుల అవసరాలు , తాగునీటి అవసరాల దృష్ట్యా తమిళనాడుకు నీటిని విడుదల చేయబోమని రాష్ట్ర ప్రభుత్వం ఇంతకు ముందు స్పష్టం చేసినప్పటికీ ఇప్పుడు అందరి కళ్లు కప్పి ఎలా తమిళనాడుకు నీళ్లు ఇస్తారంటూ ప్రశ్నించారు మంజునాథ్. ఆనకట్ట నుండి నీటిని విడుదల చేస్తున్న తాజా వీడియోను కూడా ఆయన పంచుకున్నారు. ఈ ఆరోపణను సమర్థిస్తూ ప్రభుత్వం రహస్యంగా నీటిని విడుదల చేస్తోందని కన్నడ ఉద్యమకారుడు వటల్ నాగరాజ్ ఆరోపించారు. ఇందులో కొత్తేమీ లేదు. వారు తప్పనిసరి పరిస్థితుల్లో నీటిని విడుదల చేస్తున్నారు. గతంలో కబిని నుండి విడుదల చేస్తున్నామని చెప్పి నీటిని వదిలారని మండిపడ్డారు. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ , తమిళనాడు ముఖ్యమంత్రి సి. విజయ్ జోసెఫ్ మధ్య ఒక అవగాహన ఉందని కూడా ఆయన ఆరోపించారు. నీటి రాకపోకలకు సంబంధించిన వివరాలను కోరినప్పుడల్లా, అవి అత్యంత సాంకేతికమైనవని చెబుతూ ప్రభుత్వం వాటిని వెల్లడించడానికి నిరాకరించిందని నాగరాజ్ ఆరోపించారు.
