తిరుపతి : ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ శివశంకర్ లోతేటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారానికై ‘డయల్ యువర్ ఎపిఎస్పిడిసిఎల్ సిఎండి’, ‘డయల్ యువర్ సూపరింటెండింగ్ ఇంజనీర్’, ‘కరెంటోళ్ళ జనబాట’, పారిశ్రామిక వినియోగదారులతో వీడియో కాన్ఫరెన్స్’ లాంటి వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. వినియోగదారులకు సంస్థ ఉద్యోగులు సమిష్టి కృషితో అందించిన అత్యుత్తమ సేవలకు గుర్తింపుగా ఈ యేడాది సంస్థ 2 జాతీయ అవార్డులను అందుకోవడం సంతోషకరమన్నారు. సంస్థ పరిధిలో 56 శాతం మంది వినియోగదారులు ఆన్లైన్ ద్వారా విద్యుత్ బిల్లులను చెల్లిస్తున్నారని, దీన్ని 100 శాతానికి పెంచేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని తెలిపారు.సంస్థ పరిధిలో 415 మెగావాట్ల సామర్థ్యంతో 2.07 లక్షల ఎస్సీ, ఎస్టీ వినియోగదారుల గృహాలపై రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థల ఏర్పాటులో భాగంగా ఇప్పటి వరకు 214 మెగావాట్ల సామర్థ్యంతో 1.06 లక్షల గృహాలపై సోలార్ వ్యవస్థలను అమర్చామన్నారు. ఈ పనుల్లో భాగంగా నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వశాఖ (ఎంఎన్ఆర్ఇ) గణాంకాల మేరకు రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థల్లో 50 వేల సర్వీసులను గ్రిడ్ కు అనుసంధానం చేసిన తొలి విద్యుత్ పంపిణీ సంస్థగా ఎపిఎస్పిడిసిఎల్ నిలవడం గొప్ప విషయమన్నారు.
సిఎం సూర్యఘర్ ముప్త్ బిజిలీ యోజన పథకం ద్వారా కెపెక్స్ విధానంలో ఎపిఎస్పిడీసీఎల్ పరిధిలో గ్రిడ్కు అనుసంధానమై, ఉత్పత్తి అయిన అదనపు విద్యుత్తుకు బిల్లుల సెటిల్మెంట్ లో భాగంగా ఈ యేడాది జూన్ నెలలో 14,786, జులైలో 17,086 సర్వీసులకు సంబంధించి మొత్తం రూ. 152.28 కోట్ల మేరకు విద్యుత్తు బిల్లులను నేరుగా వినియోగదారుల బ్యాంక్ అకౌంట్లకు జమ చేశామన్నారు సీఎండీ. స్వర్ణ నారావారిపల్లె పథకంలో భాగంగా అన్ని గృహాలకూ రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. కుప్పం నియోజకవర్గం పరిధిలో 78.43 మెగావాట్ల సామర్థ్యంతో ఒక్కో గృహంపై 2 కిలోవాట్ల చొప్పున మొత్తం 39,215 బిసి విద్యుత్ వినియోగదారుల గృహాలపై రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. సంస్థ పరిధిలో ఫీడర్ లెవెల్ సోలరైజేషన్ ద్వారా 610 మెగావాట్ల సామర్థ్యంతో 1.35 లక్షల పంపుసెట్లకు. సౌర విద్యుత్తు సరఫరా పనులు త్వరితగతిన జరుగుతున్నాయని, అలాగే కుప్పం నియోజకవర్గంలో ఈ పథకంలో భాగంగా 32,106 పంపుసెట్లకు సోలార్ ప్లాంట్ల పనులను పూర్తి చేయడంతో 141 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆంధ్ర ప్రదేశ్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం కింద రాష్ట్రంలో 12 లక్షల మంది రైతులకు పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్తును, ఎస్సీ, ఎస్టీలకు, ఆక్వా, చేనేత, క్షురక, దోబీఘాట్లకు సబ్సిడీపై విద్యుత్తును సరఫరా చేస్తున్నామన్నారు. వ్యవసాయ విద్యుత్ సర్వీసు దరఖాస్తుదారులు ఎపిఎస్పిడిసిఎల్ మొబైల్ యాప్ ద్వారా తమ సీనియారిటీని తెలుసుకునే సదుపాయాన్ని కల్పించామన్నారు శివ శంకర్ లోతేటి.
వినియోగదారులకు లో-ఓల్టేజ్, ఓవర్లోడ్ సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా నూతనంగా 62 సబ్-స్టేషన్ల నిర్మాణ పనులు ప్రారంభమైనట్లు తెలిపారు. సంస్థ పరిధిలో వివిధ కేటగిరీలలో13.20 లక్షల సర్వీసులకు స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయాలనే లక్ష్యంలో భాగంగా ఇప్పటి వరకు 10.74 లక్షల సర్వీసులకు స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేశామన్నారు. సంస్థ పరిధిలో ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్లు/మున్సిపాలిటీలు, వాటర్ వర్క్స్, వీధి దీపాలు తదితర 1.29 లక్షల సర్వీసులను ప్రీ-పెయిడ్ సర్వీసులుగా మార్చినట్లు వెల్లడించారు.
