22-ఏపై దుష్ప్రచారాన్ని నమ్మొద్దు : పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

అబ‌ద్దాల‌తో ప్ర‌జ‌ల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురిచేస్తున్నారు

హైద‌రాబాద్ : రాష్ట్రంలో 22ఏలో లక్షలాది ఎక‌రాలు చేర్చారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని 2023 డిసెంబర్ 7 నాటికి ఉన్న పరిస్థితి, ప్రస్తుత పరిస్థితి, ఏ కేటగిరీ భూములు ఎంత మేర నిషేధిత జాబితాలో ఉన్నాయో పూర్తి వివరాలను ప్రజల ముందు ఉంచుతున్నామ‌ని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. 22ఎ పేరిట ప్ర‌తిప‌క్షాలు అన‌వ‌స‌ర రాద్దాంతాన్ని సృష్టిస్తూ ప్ర‌జ‌ల‌ను భ‌యాందోళ‌న‌ల‌కు గురిచేస్తున్నాయ‌ని ఆయ‌న ఆరోపించారు. 22ఎ పేరిట ఇంత‌వ‌ర‌కు వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల్లో 98 శాతం రిజిస్ట్రేష‌న్లు పూర్త‌య్యాయ‌ని దీనిపై దుష్ప్ర‌చారాల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని కోరారు ఇందిర‌మ్మ ప్ర‌జా ప్ర‌భుత్వం అధికారం చేప‌ట్టిన నాటికి నిషేధిత జాబితాలో ఉన్న ఫారెస్ట్, వక్ఫ్, దేవాదాయ, అసైన్డ్, ప్రభుత్వ భూములు, కోర్టు ఆదేశాల మేరకు నిషేధిత జాబితాలో ఉన్న భూములు, ప్రైవేట్ భూములు తదితర వివరాలను కేటగిరీల వారీగా మొత్తం వివ‌రాల‌ను మీడియాకు విడుద‌ల చేశారు.

స‌చివాల‌యంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో మంత్రి మాట్లాడారు. లక్షలాది ఎకరాలు 22ఎలో పెట్టారని ప్ర‌తిప‌క్షాలు ఆరోపణలు చేయడం కాదన్నారు. ఎంత ఉంది, ఎందుకు ఉంది, ఎవరి భూమి, ఏ కారణంతో నిషేధిత జాబితాలో పెట్టార‌నే ప్రతి అంశాన్ని రికార్డులతో చెబుతాం అన్నారు . వాస్తవాలు ప్రజల ముందుకు వస్తే ఎవరు నిజం చెబుతున్నారో ప్రజలే నిర్ణయిస్తారు అన్నారు. ప్రభుత్వ భూములు, ప్రజా ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులు లేదా రియల్ ఎస్టేట్ ప్రయోజనాలకు మళ్లించకుండా కాపాడటం 22ఏ ప్రధాన ఉద్దేశమని మంత్రి స్ప‌ష్టం చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని రెండు రెవెన్యూ గ్రామాల్లో 122 ఎకరాలు, మరోచోట 400కు పైగా ఎకరాలు కలిపి సుమారు 522 ఎకరాల ప్రభుత్వ భూమికి సంబంధించిన వ్యవహారాలను మంత్రి ఉదాహరణగా ప్రస్తావించారు. ఎన్నికలకు ముందు ఈ భూముల వ్యవహారం అప్పట్లో మీడియాలో కూడా చర్చకు వచ్చిందని చెప్పారు. ప్రభుత్వ భూములను భారీ విస్తీర్ణాల్లో ప్రైవేట్ వ్య‌క్తుల‌కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రించారని ఆరోపించారు. ఇలాంటి భూముల‌ను నిషేధిత జాబితాలో పెట్ట‌డం త‌ప్పా ? ఎందుకు పెట్ట‌కూడ‌ద‌ని ప్ర‌శ్నించారు.

సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డి ప‌ల్లి రెవెన్యూ గ్రామంలో 1958కు ముందు అసైన్‌మెంట్ జరిగినట్లు చూపిస్తూ, సరైన ప్రభుత్వ రికార్డులు లేకుండానే భూములపై హక్కులు సృష్టించి దార‌ద‌త్తం చేశార‌న్నారు. హైద‌రాబాద్ జూబ్లీ హిల్స్‌లో సర్వే నంబర్ 403కు సంబంధించి సుమారు 1,280 ఎకరాల విస్తీర్ణం ఉండగా, అందులో కేవలం రెండు ప్లాట్లు మాత్రమే నిషేధిత జాబితాలో ఉన్నాయని మంత్రి తెలిపారు. గతంలో హైకోర్టు ఆదేశాల మేరకు రికార్డులు అప్‌లోడ్ చేసే సమయంలో మొత్తం సర్వే నంబర్‌ను పేర్కొనడం వల్ల ముఖ్య‌మంత్రి నివాసంతో పాటు త‌న నివాసం కూడా పీఓబీలో చేర్చార‌ని దానిని గుర్తించి వెంట‌నే స‌రి చేశామ‌ని తెలిపారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అన్నారం గ్రామంలో సర్వే నంబర్ 172 ప్రభుత్వ భూమి, 173 ప్రైవేట్ భూమి అని, 173 పేరుతో అనుమతులు తీసుకుని 172 ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు చేపట్టిన ఉదాహరణను మంత్రి వివరించారు.

మేడ్చల్ జిల్లా పర్వతాపూర్ ప్రాంతంలో ప్రధాన రెవెన్యూ గ్రామం, దానికి అనుబంధ హ్యామ్లెట్‌కు ఒకే తరహా సర్వే నంబర్లు కేటాయించడం వల్ల భూ వివాదాలు తలెత్తాయని మంత్రి చెప్పారు. సర్వే నంబర్లను సక్రమంగా పునర్వ్యవస్థీకరించి, సమగ్ర సర్వే ద్వారా ఇలాంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని తెలిపారు. మహేశ్వరం మండలంలోని 22 ఎకరాల సర్వే నంబర్‌లో రెండు ఎకరాలను భూదాన్ భూమి ఉంటే మొత్తం 22 ఎకరాలకు పాస్‌బుక్ జారీ కావడం, భూదానం చేసిన రెండు ఎకరాలను ప్రత్యేకంగా గుర్తించడంలో సమస్య ఏర్పడ‌డంతో మొత్తం 22 ఎక‌రాల‌ను పీఓబీలో పెట్ట‌డం జ‌రిగింద‌న్నారు. భూదాన్, అసైన్డ్, ప్రభుత్వ భూముల విషయంలో రికార్డులను కేసుల వారీగా పరిశీలించి, వాస్తవ హక్కుదారులకు న్యాయం చేస్తామని చెప్పారు పొంగులేటి . ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేయించు కునేందుకు నకిలీ జీఓలు, మెమోలు, అధికారుల సంతకాలతో బోగస్ పత్రాలు సృష్టిస్తున్న వ్యవహారాలను గుర్తించామని ఆమేర‌కు క్రిమిన‌ల్ కేసుల న‌మోదుకు ఆదేశాలిస్తున్నామ‌న్నారు.

Leave A Reply

Your Email Id will not be published!