కెన్యా : ఇండియాకు చెందిన టాటా కెమికల్స్ తయారీ కంపెనీకి కోలుకోలేని షాక్ ఇచ్చింది కెన్యా దేశ ప్రభుత్వం. ఈ మేరకు సంచలన ప్రకటన చేశారు దేశ అధ్యక్షుడు. భారతీయ సంస్థ అయిన టాటా కెమికల్స్ తమ కార్యకలాపాల ద్వారా దేశానికి ఎటువంటి ప్రయోజనం చేకూర్చలేదని పేర్కొంటూ, కెన్యాలో వాటిని నిలిపివేయాలని ఆదేశించినట్లు కెన్యా అధ్యక్షుడు విలియం రుటో ప్రకటన చేశారు. టాటా కెమికల్స్ నిర్వహించే కార్యకలాపాలను చేపట్టడానికి ప్రభుత్వం రెండు కొత్త కంపెనీలను తీసుకువ స్తుందని రుటో చెప్పారు. జూలై చివరలో సోడా ఫ్యాక్టరీ వద్ద కార్యకలాపాలను నిలిపి వేయాలని, సోడా యాష్ ఎగుమతులను ఆపివేయాలని కెన్యా ప్రభుత్వం తమ విభాగమైన ‘టాటా కెమికల్ లిమిటెడ్’ను ఆదేశించిందని టాటా పేర్కొంది. కెన్యా ప్రభుత్వం అధికారాన్ని గౌరవిస్తున్నామని, అలాగే పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి తగిన చట్టపరమైన , నియంత్రణ మార్గాల ద్వారా నిర్మాణాత్మక చర్చలకు కట్టుబడి ఉన్నామని టాటా కెమికల్స్ తెలిపింది. సంబంధిత నియంత్రణ నిబంధనలను పాటించడం గురించిన సమాచారంతో సహా, మంత్రిత్వ శాఖ లేవనెత్తిన అంశాలపై తమ విభాగం “సమగ్ర” సమాధానాన్ని అందించిందని టాటా కెమికల్స్ పేర్కొంది.
మగాడి అనేది దక్షిణ కెన్యాలోని కాజియాడో కౌంటీలో ఉన్న ఒక పట్టణం. రుటో ఆ రోజు అంతకుముందు అక్కడ పర్యటించారు. ఆ టాటా కంపెనీకి 100 ఏళ్ల పాటు ఆ కాంట్రాక్ట్ ఉంది. వారు కాజియాడోలో ఏమీ నిర్మించలేదు, అక్కడ ఏ ఫ్యాక్టరీని కూడా ఏర్పాటు చేయలేదు అని రుటో అన్నారు. మేము ఒక కొత్త కంపెనీని తీసుకు వస్తామని చెప్పామని అన్నారు. వారు ఇక్కడ కాజియాడోలో ఒక పెద్ద గ్లాస్ (అద్దాల తయారీ) కంపెనీని ఏర్పాటు చేయాలి. అలాగే రసాయనాల తయారీ కోసం మరో కంపెనీని కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలి. మనం ఇతరులకు బానిసలమా అని రుటో ప్రశ్నించారు. మా ఉద్యోగులు, మగాడి కమ్యూనిటీ, కెన్యాలోని మా వాటాదారులు, కెన్యా యొక్క నిరంతర ఆర్థిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడమే మా ప్రధాన లక్ష్యం అని టాటా కెమికల్స్ స్పష్టం చేసింది.
