అమరావతి : మెగా డీఎస్సీ -2025 స్పోర్ట్స్ కోటా కింద ఎంపికైన కొందరు అభ్యర్థుల టెట్ అర్హతలు, కుల ధృవీకరణ పత్రాలు , క్రీడా ధృవీకరణ పత్రాల ప్రామాణికతపై మీడియాలో వస్తున్న ఆరోపణలను విద్యాశాఖ , ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్)లు తోసిపుచ్చాయి. సచివాలయ మీడియా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విద్యాశాఖ కమిషనర్ తమీమ్ అన్సారియా, శాప్-ఛైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ భరణి మాట్లాడారు. ప్రతి ఆరోపణను అధికారిక రికార్డులు, వర్తించే నిబంధనలు , సంబంధిత అధికారుల పరిశీలన నివేదికల ఆధారంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం పారదర్శకత , ప్రతిభ ఆధారిత నియామకాలకు కట్టుబడి ఉందని వారు స్పష్టం చేశారు. ఏదైనా ధృవీకరణ పత్రం నకిలీదని తేలినా లేదా అభ్యర్థి అనర్హుడని తేలినా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని వారు పేర్కొన్నారు. టెట్ అర్హత మార్కులు ఓసీ , ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 150కి 90, బీసీ అభ్యర్థులకు 75, ఎస్సీ, ఎస్టీ , పీడబ్ల్యూడీ ,మాజీ సైనికోద్యోగులకు 60 అని విద్యాశాఖ కమిషనర్ వివరించారు. టెట్ కి 20 శాతం , టెట్ రాత పరీక్షకు 80 శాతం వెయిటేజీతో మెగా డీఎస్సీ మెరిట్ జాబితా రూపొందించ బడిందని ఆమె తెలిపారు.
అయితే స్కూల్ అసిస్టెంట్, పీఈటీ (శారీరక విద్య), ఫిజికల్ డైరెక్టర్, పీజీటీ, ప్రిన్సిపాల్ వంటి కొన్ని పోస్టులకు టెట్ అర్హత అవసరం లేదని తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. స్పోర్ట్స్ కోటా అభ్యర్థులపై వచ్చిన ఆరోపణలకు స్పందిస్తూ, చాలా మంది నిర్దేశిత టెట్ మార్కులను సాధించారని అధికారిక రికార్డులు చెబుతున్నాయని విద్యా శాఖ కమిషనర్ తెలిపారు. టెట్ అర్హతపై ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్నూలుకు చెందిన ఎడిగ ప్రభాకర్ విషయంలో, 2018లో పేపర్-II-Bలో తను 77 మార్కులు సాధించినట్లు రికార్డులు చూపిస్తున్నాయని చెప్పారు. అయితే, ఈ విషయంపై అధికారిక విచారణ కొనసాగుతోందని, విచారణ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. అదే తరహా ఆరోపణలు ఎదుర్కొన్న జంపాల ఉష, ఆయా కాలాల్లో అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం అర్హత మార్కులు సాధించారని తెలిపారు. మిరియాల గాయత్రి సాయి శ్రీ, ప్రగడ కళ్యాణి, షేక్ నాయబ్ రసూల్, జక్కుల ఉదయలక్ష్మి, తాడిమర్రి మహమ్మద్ రఫీ, దేవరకొండ పవన్ కుమార్, తోగట చరణ్ రాజా , వి. చక్రపాణి రెడ్డిల TET అర్హతను రికార్డులు ధృవీకరిస్తున్నాయని పేర్కొన్నారు.
ఆగస్టు 8 నుంచి 14, 2025 మధ్య క్రీడా కోటాకు సంబంధించిన తాత్కాలిక జాబితాను విడుదల చేసి అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించామని, ఆ తర్వాత వచ్చిన ఫిర్యాదులను కూడా పరిశీలించామని భరణి తెలిపారు. జూడో సర్టిఫికెట్లపై వచ్చిన ఆరోపణల విషయానికొస్తే, క్రీడా డీఎస్సీ వ్యవహారాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 69 రిట్ పిటిషన్లు దాఖలయ్యాయని, అయితే ఏ ఒక్కటీ కూడా ఏపీ స్టేట్ జూడో అసోసియేషన్ జారీ చేసిన సర్టిఫికెట్ల ప్రామాణికతను ప్రత్యేకంగా సవాలు చేయలేదని ఆమె చెప్పారు. జూడో సర్టిఫికెట్ల ప్రామాణికతకు సంబంధించిన విస్తృత అంశం ప్రస్తుతం హైకోర్టులో పిల్ నం. 170/2026గా విచారణలో ఉందని, అదే సమయంలో విజిలెన్స్ విచారణ కూడా జరుగుతోందని ఆమె తెలిపారు. విజిలెన్స్ శాఖ తన విచారణను పూర్తి చేసి నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించిందని, తదుపరి చర్యలు ఆ నివేదికలోని అంశాలపై ఆధారపడి ఉంటాయని ఆమె పేర్కొన్నారు.
ఒకే మండలానికి చెందిన 21 మంది జూడో అభ్యర్థులు (వారిలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ఉన్నారు) ఉన్నారన్న ఆరోపణలపై స్పందిస్తూ, సర్టిఫికెట్ల ప్రామాణికతపై విజిలెన్స్ విచారణ జరుగుతోందని, ధృవీకరణ పూర్తయ్యే వరకు ఎటువంటి తుది నిర్ణయం తీసుకోలేమని భరణి చెప్పారు.కరిష్మ, షేక్ ఇమామ్ హుస్సేన్, పెద్ద అప్పలరాజు, కోనాడ పద్మజ ,సాఫ్ట్బాల్ సర్టిఫికెట్లపై ప్రశ్నలు తలెత్తిన ఇతర అభ్యర్థులకు సంబంధించిన ఆరోపణలపైనా ఆమె స్పష్టతనిచ్చారు. అందుబాటులో ఉన్న రికార్డులు , సంబంధిత క్రీడా సంస్థల ధృవీకరణ ఆధారంగా వారి కేసులను పరిశీలించినట్లు ఆమె తెలిపారు.