గుజరాత్ : దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ లోని నవసారిలో జరిగిన సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. బీజేపీ కార్యాలయాలను ‘బాధిత ప్రజలకు ఆశ్రయం’గా అభివర్ణించారు. కొత్తగా ఏర్పాటు చేసిన కార్యాలయ వ్యవస్థ బాధిత ప్రజలకు ఆశ్రయం”గా నిలవాలని అన్నారు. భారతీయ జనతా పార్టీ కార్యాలయాలు ప్రజల సమస్యలను పరిష్కరించే కేంద్రాలుగా, అన్యాయానికి గురైన వారికి భరోసా కల్పించే వేదికలుగా మారాలని ఆయన నొక్కి చెప్పారు. పార్టీ సంస్థాగత కార్యకలాపాలు ప్రజాసేవ ప్రాతిపదికన సాగాలని ఆయన స్పష్టం చేశారు. నేడు ఒక కార్యాలయ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నప్పుడు, అది ఒక విధంగా బాధిత ప్రజలకు ఆశ్రయంగా మారాలి. ఈ ‘కమలం’ నుండి అన్యాయానికి వ్యతిరేకంగా ఆశాకిరణం ఉదయించాలి అని మోదీ అన్నారు. తమకు తగినంత న్యాయం జరగలేదని ఎవరైనా భావిస్తే వారు ఇక్కడికి వస్తారు, వారి సమస్యలన్నింటినీ పరిష్కరించడంలో ఎవరూ వెనుకాడకూడదని స్పష్టం చేశారు.
భవన నిర్మాణాన్ని చేపట్టడం సులభమేనని, కానీ దాని వెనుక ఉన్న స్ఫూర్తిని నిలబెట్టుకోవడం ముఖ్యమని ఆయన అన్నారు. మిత్రులారా ఒక భవనాన్ని నిర్మించడం కష్టం కాదు. కానీ ఈ భవనం ద్వారా మనం కొనసాగిస్తున్న సంప్రదాయం, స్వీకరించిన సేవా దీక్షకు కొత్త పరిధి లభించాలి అని ఆయన అన్నారు. ఇటువంటి కార్యాలయాలు అందరినీ కలుపుకు పోయేవిగా, అందరినీ ఆదరించేవిగా, అన్ని సమస్యలను పరిష్కరించేవిగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. పీఎం స్వనిధి పథకం గురించి ప్రస్తావిస్తూ సాధారణ విక్రేతల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని దీనిని రూపొందించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. పీఎం స్వనిధి పథకం మన వీధి వ్యాపార సోదరుల కోసం ఉద్దేశించిందన్నారు. కూరగాయలు, పాత బట్టలు అమ్మేవారు ,అనేక చిన్న తరహా వ్యాపారులు చేసే వారి కోసం ఉద్దేశించబడింది అని ఆయన అన్నారు.
తన స్వంత సాధారణ నేపథ్యమే ఇటువంటి విధానాల రూపకల్పనకు ప్రేరణ ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. నేను ఆ జీవితాన్ని గడిపాను, ఆ జీవితాన్ని దగ్గరుండి చూశాను. ప్రజలే దేవుడు అని భావించి, నాకు లభించిన స్థానం నుండి వారి కోసం ఏదైనా చేయాలనే ఆలోచనతోనే ఈ పథకాలు పుట్టుకొచ్చాయి అని ఆయన అన్నారు. ఈ పథకం వీధి వ్యాపారులను వడ్డీ వ్యాపారుల బారి నుండి విముక్తి చేసిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.