తాడేపల్లిగూడెం : వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. తాను వచ్చే ఏడాది 2027 లో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రకు శ్రీకారం చుడతానని వెల్లడించారు. బహుశా సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో ఉంటుందన్నారు. తాడేపల్లి గూడెంలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో
బాపట్ల జిల్లా పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గ వైయస్సార్సీపీ స్ధానిక సంస్ధల ప్రజా ప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈరోజు రాజకీయాలు ఎలా ఉన్నాయి? ఎలా జరుగుతున్నాయి అని నా కంటే మీరే బాగా చెప్పగలరు. మన పాలన, చంద్రబాబు పాలన మధ్య తేడా ప్రజలు గమనించారు. ప్రతి ఇంట్లో అదే చర్చ జరుగుతోందన్నారు జగన్ రెడ్డి. చూస్తుండగానే రెండున్నర ఏళ్లు గడిచాయి. చూస్తుండగానే మరో ఏడాది కూడా గడిచి పోతుంది.
ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. కార్యకర్తలు గర్వ పడేలా మన పాలన ఆనాడు సాగిందన్నారు. 5 ఏళ్ల మన పరిపాలన. రెండున్నర ఏళ్ల చంద్రబాబు పాలన మధ్య తేడాపై ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోందని చెప్పారు. ఏ ఇంటికైనా ధైర్యంగా వెళ్లగలిగేలా మన పాలన సాగిందన్నారు. మ్యానిఫెస్టోకు ఒక అర్ధం తీసుకొచ్చి, మొత్తం అమలు చేసిన చరిత్ర మనదని పేర్కొన్నారు. కానీ చంద్రబాబు, కూటమి నేతలు ఇచ్చిన మేనిఫెస్టోను గాలికి వదిలి వేశారన్నారు. కానీ మనం అలా చేయలేదని, ఏదైతే చెప్పామో దానిని వంద శాతం పూర్తి చేశామన్నారు జగన్ రెడ్డి. ఏటా బడ్జెట్ సమయంలోనే క్యాలెండర్ ప్రకటించి పథకాలు, కార్యక్రమాలు అమలు చేసిన ఘనత మనది. గతంలో ఎప్పుడూ అలా జరగ లేదన్నారు. వ్యవస్థలో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకొచ్చాం. రైతులు, పిల్లలు, మహిళలు, పేదలకు అందించే పథకాలు లంచాలు లేకుండా ఉండే పరిస్థితి ఉంటుందా? అన్న సందేహాలు తీర్చాం అన్నారు వైసీపీ బాస్.
ప్రతి 50 ఇళ్లకు వాలంటీర్, ప్రతి గ్రామంలో సచివాలయం ఏర్పాటు చేసి పాలన ఇంటి గడప వద్దే అందించామని, పూర్తి పారదర్శకంగా పథకాలు అమలు చేశామన్నారు. విద్య, వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చామన్నారు. ప్రభుత్వ స్కూళ్లు పూర్తిగా మార్చేశాం. ప్రైవేటకు థీటుగా అభివృద్ధి చేశాం. మూడో తరగతి నుంచి టోఫెల్ శిక్షణ. నాడు–నేడు పనులు. 6వ తరగతి నుంచి డిజిటల్ బోర్డులు. బైలింగ్వువల్ టెక్స్ట్‌బుక్స్. 8వ తరగతి పిల్లాడి చేతికి ట్యాబ్‌లు ఇచ్చాం అన్నారు. ఆరోగ్యశ్రీలో 1000 ప్రొసీజర్ల నుంచి 3300 ప్రొసీజర్లు. రూ.25 లక్షల వరకు పథకంలో వైద్యం అందించాం. ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్స్. నాడు–నేడు పనులతో ఆస్పత్రుల రూపురేఖలు మార్చాం అన్నారు. ఒకేసారి 18 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టాం. కొత్తగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. ప్రతి పీహెచ్సీలో ఇద్దరు డాక్టర్లు. ప్రతి మండలంలో రెండు పీహెచ్‌సీలు. ఆ నలుగురు డాక్టర్లకు ఊళ్లు పంచాం. ఒక్కో డాక్టర్‌కు 4 లేక 5 ఊళ్లు కేటాయించాం. వారు ఆయా గ్రామాలకు వెళ్లి వైద్య సేవలు అందించారని, అవన్నీ ఒక్క వైయస్సార్సీపీ ప్రభుత్వంలోనే జరిగాయని చెప్పారు.
నష్టాల్లో ఉన్న రైతులను ఆదుకున్నాం. రైతులను చేయి పట్టించుకుని నడిపించాం. వారి కోసం గ్రామాల్లో రైతు భరోసా కేం్రద్రాలు ఏర్పాటు చేశాం. వాటిలో అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్‌ను ఉంచాం. ప్రతి ఎకరాను ఈ–క్రాప్ చేశాం. పంటల గిట్టుబాటు ధర కల్పించేందుకు ఆర్బీకేల్లో పోస్టర్లు పెట్టాం. ఎక్కడైనా ధరలు రాకపోతే.. సీఎం–యాప్ ద్వారా అగ్రికల్చర్ అసిస్టెంట్ అలర్ట్ చేస్తే, వెంటనే జేసీ జోక్యం చేసుకోవడం, రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా చూడడం. ఇవన్నీ దేశంలో కూడా ఎక్కడా జరగలేదన్నారు జగన్ రెడ్డి.
చంద్రబాబు ప్రజలను మోసం చేశాడని ఆరోపించారు. ప్రతి ఇంటికి తన సంతకం, పవన్ సంతకంతో బాండ్లు పంపారు. మనం ఇచ్చిన పథకాలు మాత్రమే కాకుండా, మన కంటే ఇంకా మూడింతలు ఇస్తామని చెప్పారన్నారు. అమ్మ ఒడి కింద ఎంత మంది పిల్లలు ఉంటే, అన్ని రూ.15 వేలు ఇస్తామన్నాడు. రైతులకు రూ.26 వేలు ఇస్తానన్నాడు. చేయూత కింద జగన్ ఏటా రూ.18,750 మాత్రమే ఇస్తున్నాడు. అదే మేం వస్తే నీకు నెలకు రూ.4 వేల చొప్పున, ఏటా రూ.48 వేలు అన్నాడు. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల చొప్పున, ఏటా రూ.36 వేలు ఇస్తామని చెప్పారు.
